“దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా.. దరికి చేర్చు దారులు కూడా ఉంటాయిగా”. ఇది ఓ సినిమా పాటలో లైన్. ఈ మాటనే అక్షర సత్యం చేశాడు ఓ రిక్షావాలా కొడుకు. తండ్రి కష్టపడి రిక్షా లాగి తనని చదివిస్తే.., ఆ కష్టాన్ని వృధా పోనివ్వకుండా ఏకంగా ఐఏఎస్ సెలక్ట్ అయ్యిన ఓ విజేత సక్సెస్ స్టోరీ. ఆ వివరాల్లోకి వెళ్తే.., నారాయణ్ జైస్వాల్ ఒక గవర్నమెంట్ రేషన్ షాప్ లో పని చేసేవాడు. ఆ రేషన్ షాప్ అనుకోకుండా మూసివేశారు. దీంతో నారాయణ జైస్వాల్ ఉపాధి కోల్పోయాడు. ఇక తప్పనిసరి పరిస్థితిల్లో రిక్షా కొన్నాడు. దాని మీద వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు.
భార్య అకాల మరణం ఆయన్ని ఆర్ధికంగా, మానసికంగా కృంగతీసింది. కానీ.., నారాయణ్ జైస్వాల్ తన బాధ్యతలని విస్మరించలేదు. అలానే.., కష్టపడి తన ఇద్దరు ఆడపిలల్లకి పెళ్లిళ్లు చేశాడు. తరువాత కొడుకు గోవింద్ జైస్వాల్ ని ఉన్నత చదువు చదివించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వయసు మీద పడ్డాక కూడా కష్టపడి రిక్షా నడిపాడు. ఇలా తన కష్టాన్ని నమ్ముకునే.. కొడుకు గోవింద్ జైస్వాల్ ని ఐఏఎస్ ట్రైనింగ్ కోసం ఢిల్లీకి పంపాడు.
గోవింద్ జైస్వాల్ ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటూనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ, తన ఖర్చులకు డబ్బు సమకూర్చుకుంటూ వచ్చాడు. అలా కష్టపడి చదివి తన కోచింగ్ పూర్తి చేసుకున్నాడు గోవింద్ జైస్వాల్. తరువాత తన మొదటి సివిల్ సర్వీస్ అటెంప్ట్ 2006లోనే జాతీయ స్థాయి లో 48వ ర్యాంక్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం గోవింద్ జైస్వాల్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా గోవాలో పనిచేస్తున్నారు. చిన్నతనంలో పేద ఇంటి పిల్లాడిని అని తనని ఎవరు ఇంటికి రానిచ్చేవారు కాదని, అందుకే కష్టపడి చదివి తాను ఈ స్థాయికి వచ్చినట్టు గోవింద్ జైస్వాల్ తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు.