చూస్తూ.., చూస్తూ.. మనిషి ప్రాణాలు తీయడం అంత సులభమా? కానే.., కాదు. జాలి, విచక్షణ, దయ లేకుండా 18 మంది ప్రాణాలను తీయడం మనిషి పుట్టుక పుట్టిన వాళ్ళు చేయలేరు. కానీ.., డబ్బు కోసం అతి కిరాతకంగా సాటి మనిషని చంపడం మహ్మద్ అబ్దుల్ సయ్యద్ .. అలియాస్ మున్నాకి కత్తితో పెట్టిన విద్య. జాతీయ రహాదారులపై మారణహోమం సృష్టించిన మానవ రూపంలో ఉన్న రాక్షసుడు అతడు. 17మంది అమాయక లారీ డ్రైవర్లను క్లీనర్లను పొట్టన పెట్టుకున్న కేసులో ఒంగోలు జిల్లా 8వ అదనపు సెషన్స్ కోర్ట్ ఈరోజు తుది తీర్పు వెలువరించింది. మున్నాతో సహా 12 మందికి ఉరి శిక్ష విధించింది. మరి.. ఇంతలా మున్నా సృష్టించిన మారణ హోమం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.మున్నా పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు. చిన్నతనంలోనే మెకానిక్ గా జీవితాన్ని ప్రారంభించాడు. అక్కడే గొడవలు, చిన్న చిన్న దొంగతనాలు అలవాటు చేసుకున్నాడు. మద్యానికి, వ్యసనాలకు బానిస అయ్యాడు. ఇక్కడే మున్నా జీవితం గతి తప్పింది. ఇక తరువాత కాలంలో డబ్బు కోసం హత్యలు చేసే వరకు పోయాడు. మున్నా మొదటిసారి హత్య చేసింది తన బంధువులనే. ఇలా తన బంధువుల జంట హత్యతో మొదలైన మున్నా నేర పరంపర హైవేలో దారి దోపిడీలు చేయడం వరకు వెళ్ళింది.గత 13 క్రితం ఏపీలోని పలు హైవేలపై లారీలు మిస్ అయ్యాయి. ఓ దారి దోపిడీ ముఠా వీటిని అపహరిస్తోంది. వాటికి సంబందించిన డ్రైవర్ల ఆచూకీ లేకుండా పోతున్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటంతో పోలీసులు వాటిపై దృష్టి పెట్టారు. ఎంత ప్రయత్నించినా లారీలకు సంబందించి ఒక్క క్లూ కూడా కనిపెట్టలేకపోయారు. మొత్తం 17 మంది డ్రైవర్లు కనిపించ కుండా పోయారు. అప్పట్లో ఒంగోలు ఎస్పీ ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుని 3 ఏళ్ళ పాటు శ్రమ పడితే మున్నా పేరు బయటకి వచ్చింది.మున్నా ఓ గ్యాంగ్ తయారు చేసుకుని.., దారి దోపిడీలు చేయడం ప్రారంభించారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే డ్రైవర్లే ఇతని టార్గెట్. ఆర్టీవో ఆఫీసర్లమంటూ హైవేల్లో లారీలు ఆపేవాళ్లు. లారీ పేపర్స్ చూపించాలని డిమాండ్ చేసే వాళ్లు. డ్రైవర్లు పేపర్లు వెతికే పనిలో ఉండగా వారిపై దాడి చేసి లారీ స్వాధీనం చేసుకునేవారు. లారీలను ముక్కలు చేసి వాటి పార్ట్స్ సపరేట్ గా అమ్ముకునే వాళ్లు ఇందుకోసం అండర్ గ్రౌండ్ షెడ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
ఒంగోలులో మున్నా యాక్టివిటీస్ తగ్గిపోవడంతో అతను మారిపోయాడని భావించారు పోలీసులు. కానీ.., ఒక రోజు తమిళనాడుకు చెందిన ఓ డ్రైవర్ హైవేపై కొందరు వ్యక్తులు తనపై దాడి చేసి లారీని లాక్కున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్ చెప్పిన ఆధారాల ప్రకారం ఈ దోపిడీలు చేస్తున్నది మున్నా ముఠా అని గుర్తించారు పోలీసులు. దీనితో పోలీసుల చర్యలను పసిగట్టిన మున్నా రాష్ట్రం నుంచి పారిపోయాడు. అతను కర్ణాటక లో ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో వెంటనే అక్కడికి వెళ్లి ముఠాతో సహా నిందితున్ని అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చి మహారాష్ట్ర కి పారిపోయాడు. మహారాష్ట్రలో గన్ డీలర్స్ తో లింక్ పెట్టుకున్నాడు మున్నా. వేరే రాష్ట్రాల నుంచి గన్స్ తెప్పించి అమ్మేవాడు. అక్కడే.., తాను ఓ ఎంకౌంటర్ లో చనిపోయినట్టు ప్రపంచాన్ని నమ్మించాడు. పోలీసులు కూడా మహారాష్ట్రలో చనిపోయింది మున్నానే అని నిర్ధారించారు. కానీ.., మున్నా చనిపోలేదు. తన వేషం మార్చుకున్నాడు.తరువాత కాలంలో మున్నా మళ్లీ ఒంగోలుకు వచ్చాడు. రియల్టర్ కొత్త అవతారమెత్తి మోసాలు చేయడం ప్రారంభించాడు. ఇక్కడితో ఆగిపోయి ఉన్నా.., మున్నా పోలీసులకు చిక్కేవాడు కాదు. కానీ.., అదే ఒంగోలు, అదే జాతీయ రహదారి, అదే దరి దోపిడీ. మనిషి ఆచూకీ ఉండదు. వాహనం ఆచూకీ ఉండదు. సో.., ఇది కచ్చితంగా మున్నా గ్యాంగ్ పనే అనుకున్నారు పోలీసులు. మున్నా చనిపోయినా, అతని గ్యాంగ్ ఈ పని చేసి ఉంటుందని ముందుగా భావించారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా.., మున్నా బతికే ఉన్నాడని పోలీసులకు అర్ధం అయ్యింది. చాలా కష్టపడి అతన్ని పట్టుకున్నారు. మున్నా పాపాల చిట్టాను కోర్ట్ ముందు ఉంచారు. పోలీసులు బలమైన సాక్ష్యాధారాలను నిరూపించటంతో కోర్టు సోమవారం మున్నాతో సహా అతనిగ్యాంగ్ లోని మరో 11 మందికి ఉరిశిక్ష నలుగురికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. ఏదేమైనా.. జాతీయ రహదారిపై నెత్తుటేర్లు పారించిన మున్నా గ్యాంగ్ అట కట్టించడంలో ఒంగోలు పోలీసుల కష్టం మరిచిపోలేనిది. మరి చూశారు కదా.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.