హైదరాబాద్- దేశంలోకి సకాలంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది. గత వారం పది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతు రుతుపవనాలకు తోడు అల్పపీడవ ద్రోణి ప్రభావంతో గత రెండు మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధ్రోణి ప్రభావం మరో రెండు, మూడు రోజుల పాటు కొనసాగనుందని, దీంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో మంగళవారం సాధారణ వర్షపాతం 7 మీల్లీ మీటర్ల నుంచి 13 మీల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో 123.1మీల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 64.5 మీల్లీ మీటర్ల నుంచి 115మీల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇక వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాలో 2.4 నుంచి 15.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది. రానున్న రెండు, మూడు రోజులు సైతం భారీగానే వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణలో అక్కడక్కడ ఈదురు గాలులు వీయడంతో పాటు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగానే వర్షం పడనుందని వాతావరణ కేంద్ర అధికారులు చెప్పారు.