అమరావతి- బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు కోస్తా తీరాలకు దగ్గరగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ మధ్యన ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల నుంచి 4.5 కిలో మీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది. దీంతో ఈ నెల 6న ఉత్తర, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉత్తర కోస్తాంధ్రలోని చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
శని, ఆది వారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక దక్షిణ కోస్తాంధ్రలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తాంధ్రలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.