తిరుమల- ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వదలడం లేదు. గత కొన్ని రోజులుగా కరుస్తున్న భారీ వర్షాలకు రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. జన జీవనం అస్థవ్యస్తం అవుతోంది. అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కురుస్తున్న వర్షాల నేపధ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇక ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతిని భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. మంగళవారం రాత్రి కురిసిన జోరు వానకు తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. లింక్ రోడ్డు తర్వాత మూడు ప్రాంతాలలో ఘాట్ రోడ్డు కుంగిపోయింది. తిరుమల కొండపై నుంచి ఘాట్ రోడ్డుపై భారీ బండరాయి పడింది. దీంతో ఘాట్ రొడ్డు మొత్తం మూడు చోట్ల పాక్షికంగా ధ్వంసమైంది. ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారింది.
తిరుమల నుంచి క్రిందకు వచ్చే వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన టీటీడీ అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేసి, తాత్కాలికంగా రెండో ఘాట్ రోడ్డును మూసేశారు. లింక్ రోడ్డు నుంచి మొదటి ఘాట్ రోడ్డులోకి వాహనాలు దారి మళ్లించారు. గత పదిహేను రోజులుగా తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొండపై ఉన్న జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి.
జోరు వాన కారణంగా తరుమలలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాఢ వీధులు, తిరుమల రహదారులపైకి వర్షపు నీరు భారీగా చేరడంతో టీటీడీ సిబ్బంది వర్షం నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా వర్షం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీవారి భక్తులకు వసతి, ఆహార సౌకర్యాలు కల్పిస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.