తమిళనాడు క్రైం- ఈ కాలంలో పెళ్లైనా కూడా మరొకరిని ప్రేమించడం సర్వసాధారణం అయిపోయింది. కట్టుకున్న భార్యను మోసం చేసి రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకునేవాళ్లు కూడా ఉన్నారు. ఇలా చేసే వాళ్లు దొరకనంత వరకు బాగానే ఉంటున్నారు. కానీ దొరికిపోయాక మాత్రం అసలు బండారం బయటపడుతుంది. తమిళనాడులో ఇలాగే పెళ్లైన ఓ యువకుడు, తనతో కలిసి పనిచేస్తున్న యువతిపై మనసు పారేసుకుని, ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు.
తన రెండో పెళ్లి కోసం ఏకంగా హలోబ్రదర్ సినిమా స్టోరీ చెప్పి మేనేజ్ చేయాలనుకున్నా చివర్లో బెడిసికొట్టింది. అసలేమైందంటే.. చెన్నై అరుంబక్కమ్‌కు చెందిన 30 ఏళ్ల వలందర్ బెన్నెట్ ర్యాన్ కు పెళ్లైంది. అంతే కాదు వారికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. ఐతే తనతో పాటు పనిచేసే 21ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు బెన్నెట్. ఇంకేముంది ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్లే యువతి ఇంట్లో ఒప్పించి ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఆ యువతి కుటుంబం నుంచి కట్నం రూపంలో 3లక్షల 50 వేల రూపాయలను కూడా తీసుకున్నాడు బెన్నెట్.
ఈ క్రమంలో వీరిద్దరి కామన్ ఫ్రెండ్ ద్వారా బెన్నెట్ పెళ్లి గురించి తెలిసింది. అతనికి పెళ్లి కావడంతో పాటు ఓ పాప కూడా ఉందని తెలిసి ఆ యువతి షాక్ అయ్యింది. ఇదే విషయంపై బెన్నెట్ ను నిలదీస్తే, వాడు నాగార్జున నటించిన హలో బ్రదర్ సినిమా కధ చెప్పాడు. తనతో పాటు తనకు ఓ అన్న ఉన్నాడని, తామిద్దరం కవలపిల్లమని చెప్పుకొచ్చాడు. పెళ్లైంది తన అన్నకని, ఆ ఫోటోనే నువ్వు చూసిందని నమ్మబలికాడు. అందుకు ఆ కేటుగాడి తల్లి కూడా వంత పాడింది. దీంతో నిజమే కాబోలు, తానే పొరపాటు పడ్డానని ఆ యువతి అనుకుంది.
ఇక వాళ్లిద్దరి పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా, మరో ఫ్రెండ్ ద్వార బెన్నెట్ కు అన్న లేడని, అతనొక్కడే అన్న విషయం తెలిసింది. ఈ సారి గట్టిగా నిలదీయడంతో, తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు బెన్నెట్. ఈ విషయాన్ని పెద్దది చేస్తే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న తల్లీ, కొడుకులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.