హైదరాబాద్- ప్రస్తుత జనరేషన్ ఏమొచ్చినా తట్టుకోవడం లేదు. అది సంతోషం కానీ, బాధ కాని. చిన్న పాటి కష్టానికే తట్టుతోలేకపోతోంది నేటి యువత. కొద్ది పాటి మానసిక ఒత్తిడికే ప్రాణాలు తీసుకుంటున్నారు. తాము కావాలనుకున్నది దక్కకపోయినా, అనుకున్నది సాధించలేకపోయినా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదిగో హైదరాబాద్ లో ఉన్నత చదువులు చదవాల్సిన యువతి ఆవేశంలో సూసైడ్ చేసుకుంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఎంటెక్ చదువుతున్న మౌనిక అనే విధ్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మౌనిక పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన రఘుశాల లచ్చయ్య, రజిత దంపతుల కుమార్తె. 27 ఏళ్ల ఈ విధ్యార్ధిని హెచ్‌సీయూలో ఎంటెక్ నానో టెక్నాలజీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమె తండ్రి లచ్చయ్య సొంత ఉర్లో వ్యవసాయం చేస్తుంటారు. టెంత్ వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిన తర్వాత మౌనికకు బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు వచ్చింది. అక్కడ ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని హెచ్‌సీయూలో ఎంటెక్‌లో చదువుతోంది.
మొన్నటి వరకు కరోనా నేపధ్యంలో క్యాంపస్ మూసివేసినా, ఈనెల 18 నుంచి ఎంటెక్ విద్యార్థులను క్యాంపస్‌లోకి అనుమతించారు. దీంతో ఈనెల 18వ తేదీన మౌనిక యూనివర్శిటీకి వచ్చి లేడీస్ హాస్టల్ లో ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం నుంచి మౌనిక గదిలోంచి బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థినులు వెళ్లి తలుపు తట్టారు. లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వెంటిలేటర్‌లోంచి చూడగా మౌనిక కిటికీ చువ్వకు వెలాడుతూ కన్పించింది.
వెంటనే వారు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు తలుపు బద్దలుకొట్టి లోనికి వెళ్లి పరిశీలించారు. గదిలోకి వెళ్లి చూసే సరికే ఆమె చనిపోయి ఉంది. మౌనిక చేతిలో ఓ సూసైడ్ నోట్ ఉంది. ఐయామ్ సో బ్యాడ్ డాటర్.. మిస్ యూ నాన్న.. అమ్మ.. అని రాసి ఉన్న సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మానసిక ఒత్తిడి వల్లే మౌనిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.