సిద్దిపేట- తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. సిద్దిపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కార్యక్రమాన్ని ముంగించుకుని హైదరాబాద్ వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కొండపాక మండలం దుద్దెడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఒక్కసారిగా అడవి పందులు అడ్డురావడంతో హరీశ్ రావు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి హరీశ్ రావుకు స్వల్ప గాయాలయ్యాయినట్లు తెలుస్తోంది.
హరీష్ రావు కారు డ్రైవర్‌తో పాటు గన్ మెన్‌కు కూడా గాయాలయ్యాయి. కారు మధ్య సీట్లో హరీశ్ రావు కూర్చోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ప్రమాదంలో హరీశ్ రావు కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో గాయపడిన హరీశ్ డ్రైవర్, గన్‌మెన్ లను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనతో దుద్దెడ వద్ద కొంతసేపు రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదం జరిగిన కాసేపటి తరువాత మంత్రి హరీష్ రావు వేరే కారులో హైదరాబాద్ వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాదంలో హరీష్ రావు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆ సమయంలో కామారెడ్డి పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు కారు ప్రమాదంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. మంత్రి హరీశ్ రావుతో సీఎం కేసీఆర్ మాట్లాడినట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న పలువురు మంత్రులు, టీఆర్ ఎస్ నేతలు హరీష్ రావుతో ఫోన్ లో మాట్లాడి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. కార్యకర్తలు ఎవ్వరు కంగారు పడవద్దని, తాను క్షేమంగానే ఉన్నానని హరీష్ రావు తెలిపారు.