తిరుపతి- లైంగిక వేధింపులు.. ఈ మధ్య తరుచూ వినిపిస్తున్న పదం. అవును పని చేసే చోటు నుంచి, విద్యా సంస్థల వరకు ఎక్కడ చూసినా మహిళలకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని కఠన చట్టాలు తీసుకువచ్చినా అమ్మాయిలకు, మహిళలకు ఇక్కట్లు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఆద్వర్యంలోని విద్యా సంస్థల్లోను లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది.
తిరుపతి ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. ప్రిన్సిపాల్ సురేంద్ర నాయక్, వార్డెన్ రామనాథాన్ని అరెస్టు చేయాలంటూ విద్యార్థి, మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన అధికారులు ప్రిన్సిపాల్ తో పాటు వార్డెన్‌ను సస్పెండ్ చేశారు.
ఎస్వీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ సురేంద్ర, వార్డెన్ రామనాథం తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ బాధిత విద్యార్థినులు వారం రోజుల కిందట టీటీడీ అధికారులకు పిర్యాదు చేశారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపట్టాలంటూ టీటీడీ ఆదేశించింది. టీటీడీ ఆదేశాల మేరకు నిజనిర్ధారణ చేపట్టిన కమిటీ, ప్రిన్సిపాల్, వార్డెన్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేల్చడంతో అధికారులు ఆ ఇద్దర్నీ సస్పెండ్ చేశారు.
తమను లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్, వార్డెన్లపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ విద్యార్థినులు, మహిళా సంఘాలు కళాశాల ముందు ఆందోళన చేశారు. దీంతో ఈ ఘటనకు సంబందించి విచారణ ఇంకా కొనసాగుతుందని, విచారణకు సంబందించిన నివేధిక రాగానే చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.