పురోహితుడి అంటే ఒకప్పుడు నిజంగానే దైవంలా భావించే వారు. ఊరిలో ఏ కార్యం జరగాలన్నా వారి చేతుల మీదగాననే జరిపించే వారు. సామాన్యుల నుండి జమీందార్ల వరకు పురోహితుడికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుని గౌరవించే వారు. కానీ.., కాలం మారే కొద్దీ పురోహితుల జీవితాలు చాలా దుర్లభం అయిపోయాయి. వాస్తవంలోకి వచ్చి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు పౌరోహిత్యం చేసే వాళ్ళకి సరిగ్గా పెళ్లిళ్లు కూడా కావడం లేదు. సరిపడే ఆదాయం లేక, సరైన గుర్తింపు, మర్యాద లేక.., జంధ్యం వేసుకున్న పాపానికి మరోపని చేయలేక వారు నరకం అనుభవిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ పురోహితుడికి విగ్రహం పెట్టి.., ఆయనే దేవుడిలా కొలుస్తున్నారు ఓ గ్రామా ప్రజలు. మరి… దీనికి కారణం ఏమిటో తెలుసుకుందాం. మాచర్ల మండలం కంభంపాడు గ్రామ ప్రధాన బురుజు వీధి,భొడ్రాయి బజార్ లో ఒక పౌరోహితుడికి విగ్రహం పెట్టి అయన పై ఉన్న ప్రేమ అభిమానాలను చాటుకున్నారు కంభపాడు గ్రామస్థులు. ఆ పురోహితుడి పేరు.. జక్కేపల్లి కృష్ణమూర్తి. బతికినంత కాలం డబ్బు ఆశించకుండా పేద, ధనిక భేదం లేకుండా.. ఇచ్చిన సంభావన మాత్రమే తీసుకుని అనేక వందల మందికి వివాహాలు,ఇళ్ళ లో శుభకార్యాలు జరిపించారు కృష్ణమూర్తి.
నిజానికి ఒకప్పుడు వీరిది బాగా బతికిన కుటుంబం. పల్నాడు ప్రాంతంలో పేదలను ఆదుకోవడానికే వీరి ఆస్తులు అన్నీ కరిగిపోయాయి. ధాన దర్మాలతో వారి ఇల్లు ఎప్పుడూ జనాలతో నిండిపోయి ఉండేది. కాలక్రమేణా ఆస్తి కరిగిపోయినా., కృష్ణమూర్తి తన స్వభావాన్నిమార్చుకోలేదు. ఎప్పుడూ డబ్బు కోసం చూడక గ్రామస్తులకు ఆధ్యాత్మికంగా మార్గనిర్దేశం చేసేవారు. ఎవరి ఇంటిలో శుభకార్యాలు ఉన్నా నిర్వహించి వారి స్తోమతతో ఒక్కరూపాయి, కొబ్బరి చిప్ప ఇచ్చినా ఆనందంగా స్వీకరించేవారు. నిజంగానే ఒక్క రూపాయి సంభావనగా తీసుకుని ఆయన జరిపించిన పెళ్లిళ్లు చాలానే ఉన్నాయి. పైగా.. భవిష్యత్ ని నచ్చానా వేయడంలో కూడా ఈ పురోహితుడు సిద్దహస్తుడు. ఇక దొంగిలింపబడిన వస్తువు లేదా తప్పిపోయిన గేదెలు తన అంజనం ద్వారా ఎటు ఉన్నాయో ఖచ్చితంగా తెలిపేవారు. పైగా.., దీనికి కూడా డబ్బులు తీసుకునే వారు కాదు. ఇలా ప్రజల అందరి కి తలలో నాలుకలా ఉండేవారు జక్కేపల్లి కృష్ణమూర్తి. పైగా.., కుల మతాల పట్టింపు ఆయనకి అస్సలు ఉండేది కాదు. అందరిని సమానంగా చూసేవారు. అందుకే ఆయన ప్రస్తుతం తమ మధ్య లేకున్నా.. తమ గుండెలలోను, విగ్రహం రూపం లో కూడా పదిల పరిచామని అంటున్నారు గ్రామస్థులు. గ్రామానికి చెందిన కావూరి వంశస్తులు ఈ విగ్రహం నిర్మించి., రోజు పూజలు నిర్వహస్తుండటం విశేషం.