గుంటూరులో జరిగిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసుకి నిదానంగా రాజకీయ రంగు పులుముకుంటుంది. దిశా చట్టాలు, యాప్స్ అంటూ జగన్ సర్కారు హడావిడి చేయడం తప్ప, వారికి మహిళలకి రక్షణ కల్పించడంలో చిత్తశుద్ధి లేదంటూ విపక్షాలంతా ఏకమై గొంతు కలుపుతున్నాయి. స్వతంత్ర దినోత్సవం నాడే ఇలాంటి దారుణం జరగడం దేనికి సంకేతమని టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీస్ వ్యవస్థని నిలదీస్తున్నారు. తాజాగా ఈ విషయంలో టీడీపీ మహిళా నేత అనిత కూడా స్పదించారు.
కొత్త చట్టాలు, కొత్త యాప్స్ తీసుకొచ్చినంత మాత్రాన సమస్యకి పరిష్కారం దొరికినట్టు కాదు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏపీలో మహిళల పై 200కి పైగా దాడులు జరిగాయని, వీరిలో ఎంత మందికి కఠినమైన శిక్షలు పడ్డాయని అనిత ప్రశ్నించారు. రాష్ట్ర హోమ్ మంత్రి సొంత జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది కాబట్టి.., నైతిక బాధ్యత వహించి హోమ్ మినిష్టర్ మేకతోటి సుచరిత, డీజీపీ సవాంగ్ రాజీనామా చేయాలని, రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని అనిత డిమాండ్ చేశారు. మరోవైపు ఘటన జరిగిన 24 గంటలలోపే నిందితుడు శశిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి అతడి స్వగ్రామం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు. మరి.. రాష్ట్రంలో మహిళా రక్షణ విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.