రాత్రి పూట ఇంట్లో చిన్న పురుగు కనిపిస్తేనే భయపడిపోతుంటాం. అలాంటిదీ ఏకంగా పులులు పొలాల్లోకి చొరబడి.. రైతులను భయపెడుతున్నాయి. ఈ పులల బారిన నుండి బయటపడేందుకు ఓ రైతు వినూత్నమైన ఆలోచన చేశారు.
ఆరుగాలం కష్టించి పండించే రైతుకు అడుగడునా కష్టాలే. విత్తు వేసిన మొదలు మార్కెట్ లో పంట అమ్ముడయ్యే వరకు కంటి మీద కునుకు ఉండదు. గింజ మొలకెత్తి నాటి నుండి చేనుకు నీళ్లు అందించడం, పురుగులు మందు కొట్టడం, కలుపు తీయడం వంటి పనులు చేస్తుంటాడు. పంట మొగ్గ దశలో ఉన్నప్పుడు పిట్టలు, కోతులు, ఇతర జంతువుల బారిన పడి నుండి పంటను కాపాడుకునేందుకు రాత్రి సమయాల్లో కూడా కాపలా కాస్తూ ఉంటాడు. అటువంటి ఓ రైతుకు ఉపద్రవంలా మారాయి పులులు. ఏకంగా రాత్రి పూట పంటపొలాల్లోకి పులులు వచ్చేస్తుండటంతో భయాందోళనకు గురైన ఓ రైతు వినూత్న నిర్ణయం తీసుకున్నాడు.
గుజరాత్ రాష్ట్రంలోని ఆరావళి జిల్లాలోని కొన్ని గ్రామాల్లోని గ్రామ వాసులు భయాందోళనలో ఉన్నారు. ఇటీవల ఆ ప్రాంతాల్లో పులులు దాడి చేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే భట్ కోట, రామేశ్వర్ కంపా, గోఖర్వా, శాంపూర్ సర్దోయ్, లాల్ పూర్ తో సహా 15 గ్రామీణ ప్రాంతాల్లో చిరుత పులులు భీభత్సం సృష్టించాయి. రాత్రి వేళ్లలో ఆ గ్రామాల్లోని మనుషులపై దాడి చేస్తున్నాయి. దీంతో రాత్రంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఇలా ఉండగా భట్ కోటలోని గ్రామంలోని గుడికి సమీపంలోని పొలంలో నాలుగు చిరుతలు కనిపించడంతో గ్రామవాసులు భయపడుతున్నారు. గ్రామంలోకి చిరుతలు వచ్చేస్తాయని భయంతో రాత్రంతా కాపలాలు కాస్తున్నారు.
ఇంటి వద్దే కాకుండా పొలాల వద్ద కాపలా ఉంటున్న రైతుల సంగతి ఇక చెప్పనక్కర్లేదు. ఎటు నుండి పులి దాడి చేస్తుందోనన్నకంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. ప్రతి రాత్రి ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్న ఓ రైతు.. వినూత్న ఆలోచన చేశాడు. వాటిని పట్టి బోనులో ఎలానూ పెట్టలేనేమో అనుకున్నాడెమో.. ఏమో చివరకు అతనే ఓ బోను తయారు చేసుకుని, పొలంలో దానిలో ఉంచి.. అందులోనే ఉంటున్నాడు. పులి నుండి తనను తాను రక్షించుకునేందుకు ఇంత కన్నా మార్గం లేదని ఆ రైతు చెబుతున్నారు. ఈ చిరుత పులులు మమ్మల్ని తీనేసే ముందే వాటిపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.