మద్యం అంటే చాలా మందికి అదొక ఎమోషన్. ఎప్పుడూ మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరే ఉంటారు. అలాంటి ఒక మద్యం దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నికి మద్యం, ఫర్నిచర్ మొత్తం దగ్ధమైంది.
మద్యం దుకాణం అంటే చాలా మందికి ఒక ఎమోషన్ అని చెప్పచ్చు. రాష్ట్రం ఏదైనా మద్యం అనేది ప్రధాన ఆదాయ వనరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే మద్యం లేనిదే ఏ పనీ జరగదు. చాలా మందికి ఇది అలవాటు పడిన సాంప్రదాయం. అలాంటి మద్యం దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. లక్షల రూపాయల సరుకు అగ్నికి ఆహుతి అయ్యింది. షాపులో ఉండే ఫ్రిడ్జ్, ఫర్నీచర్ కూడా మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనపై పలు అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. కావాలనే ఈ పని చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తిరుపతి జిల్లా తొట్టెంబేడు మండలం, చిన్నసింగమాల వద్ద ఈ ఘటన జరిగింది. పూతలపట్టు- నాయుడుపేట ప్రధాన రహదారి పక్కనే చిన్నసింగామల ప్రభుత్వ మద్యం దుకాణం ఉంది. సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మద్యం దుకాణం సిబ్బంది, అగ్నిపమాక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోపే దుకాణంలో ఉన్న మద్యం, కంప్యూటర్, ఫ్రిడ్జులు, ఫర్నీచర్ అన్నీ అగ్ని ఆహుతి అయ్యాయి. రూ.55 లక్షల మద్యం, రూ.15 లక్షల విలువజేసే ఫర్నిచర్ దగ్ధమైనట్లు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
అయితే ఇటీవలే ఆ దుకాణంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాంటి విమర్శల తర్వాత ఇలా అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిన్న సింగామల మద్యం దుకాణంలో అక్రమాలు జరిగినట్లు ఎస్ఈబీ అధికారులకు కూడా సమాచారం అందింది అంటూ చెబుతున్నారు. అయితే అగ్నిప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ కాదంటూ విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన కాసేపటికి గ్రామస్థుడు ఫోన్ చేసి విద్యుత్ ఆపాలంటూ తమకు చెప్పారంటూ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ ఘటనపై నిజాలు తేల్చాలంటూ స్థానికులు కోరుతున్నారు.