అమరావతి- చింతామణి.. ఈ నాటకం గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు గాని, మన ముందు తరానికి మాత్రం చింతామణి నాటకం గురించి బాగా తెలుసు. అప్పట్లో ఈ సామాజిక నాటకం చాలా ఫేమస్. 20వ శతాబ్దం మొదట్లో అప్పటి ప్రముఖ కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకానికి ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది.
చింతామణి నాటకాన్ని మొట్టమొదటిసారి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రామ్మోహన నాటక సంఘం వారు ప్రదర్శించారు. ఈ నాటకంలో చింతామణి, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి, శ్రీహరి, భవానీ శంకరం పాత్రలు కీలకమైనవి. నాటకంలోని సుబ్బిశెట్టి పాత్ర చింతామణి అనే స్త్రీ వ్యామోహంలో ఆస్తినంతా పొగొట్టుకుంటుంది. అలాంటి పాత్ర తమను కించపరిచేలా ఉందని ఆర్యవైశ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూవస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చింతామణి నాటకంపై నిషేధం విధించింది. మహాసభ ప్రతినిధులు సీఎం జగన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో చింతామణి నాటకం ప్రదర్శనలను నిషేధించాలని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చేసిన విజ్ఞప్తి మేరకు జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
దీనిపై ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక నోట్ జారీ చేసింది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత శాఖకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్టు ఆ నోట్‌లో ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఇకపై చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.