టెక్నాలజీ డెస్క్- గూగుల్.. ఇది లేని ప్రపంచాన్ని ఇప్పుడు అస్సలు ఊహించుకోలేము. మనకు ఏ సమాచారం కావాలన్నా ఠక్కున వెచికేది గూగుల్ లోనే. ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే గూగుల్ మ్యాప్ లోకి వెళ్తే చాలు అదే దారి చూపిస్తుంది. అలా అన్నింటికి గూగుల్ మనిషి జీవితంతో పెనవేసుకుపోయింది. ఇతర సెర్చ్ ఇంజిన్ లు ఎన్ని వచ్చినా గూగుల్ స్థానం ప్రత్యేకం అని చెప్పకతప్పదు.
ఇదిగో ఇప్పుడు గూగుల్ మరో అద్భుతమైన ఫీచర్ ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తెస్తోంది. సాధారనంగా మనం షాపింగ్ చేయడాని, లేదంటే ఇతర పనుల మీద బయటకు వెళ్లాలంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందోనని ఆలోచిస్తాం. కరోనానే ఇందుకు కారణమని చెప్పవచ్చు. కరోనా మహమ్మారి వచ్చాక రద్దీగా ఉండే ప్రాంతాల వైపు వెళ్లాలంటేనే వణికిపోతున్నాం. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ సెర్చ్ ఇంజిన్ గూగుల్.. గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.
రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్ని గుర్తించడం ఈ ఫీచర్ స్పెషాలిటీ. సెలవు రోజుల్లో కుటుంబంతో సరదాగా బయటకు వెళ్లేందుకు, షాపింగ్ చేసేందుకు గూగుల్ మ్యాప్స్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇందు కోసం గూగుల్ సంబంధిత ప్రాంతాలకు చెందిన షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు, డైరెక్టరీస్ ను సేకరించింది. వాటి సాయంతో ఆయా లోకేషన్ లో ఉన్న వ్యక్తుల కదలికలు, ఏ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉందో గుర్తిస్తుందన్నమాట.
ఈ సరికొత్త గూగుల్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకోసం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొనిరానుంది. వరల్డ్ వైడ్ గా ఎయిర్ పోర్స్ట్, షాపింగ్ మాల్స్, బస్టాండ్స్, రైల్వే స్టేషన్ లతో పాటు, రహదారులను గుర్తించడానికి సహాయపడుతుంది. ఈ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత, వినియోగదారులు ఒక ప్రాంతంలో ఉన్న అన్ని షాపులు, రెస్టారెంట్ లు, విమానాశ్రయ లాంజ్ లు, కార్ రెంటల్, పార్కింగ్ స్థలాల్ని ఈజీగా తెలుసుకోవచ్చని గూగుల్ తెలిపింది. భలే ఉంది కదా ఈ గూగుల్ ఫీచర్.