కళాసిగూడ ప్రాంతంలో నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిన పదేళ్ల చిన్నారి ఘటనలో జీహెచ్‌ఎంసీ దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఇందుకు ఇద్దరు అధికారులను భాద్యులను చేస్తూ వారిపై వేటు వేసింది.
సికింద్రాబాద్‌లోని కళాసిగూడ ప్రాంతంలో పదేళ్ల చిన్నారి నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఉదయం పాల ప్యాకెట్ కోసం అన్నతో కలిసివచ్చిన చిన్నారి జీహెచ్‌ఎంసీ సిబ్బంది తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఇందుకు ఇద్దరు అధికారులను భాద్యులను చేస్తూ వారిపై వేటు వేసింది. బేగంపేట డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ తిరుమలయ్య, వర్క్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎగ్జక్యూటివ్ ఇంజినీర్ ఇందిరా భాయ్‌కు ఆదేశాలు జారీచేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి పది రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని తెలిపింది.
ఇదిలావుంటే.. ఈ విషాద ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు. చిన్నారి మృతిపట్ల ద్రిగ్భాంతి వ్యక్తం చేసిన మేయర్.. బాలిక కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపిన మేయర్.. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మ్యాన్‌హోల్స్ మూయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ అధికారులపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం తెల్లవారుజామున నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఈ క్రమంలో వర్షపు నీరు లోనికి పోవడానికి జీహెచ్‌ఎంసీ సిబ్బంది మ్యాన్ హోల్ ను తెరిపించారు. అదే సమయంలో సికింద్రాబాద్‌లోని కళాసిగూడ ప్రాంతంలో మౌనిక అనే చిన్నారి పాల ప్యాకెట్ తీసుకురావడానికి తన అన్నతో కలిసి బయటకు వచ్చింది. రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో.. ఓపెన్ నాలాను గుర్తించకుండా మౌనిక సోదరుడు అందులో పడబోయాడు. వెంటనే అతనిని రక్షించడానికి ప్రయత్నించిన చిన్నారి అందులో పడిపోయింది. స్థానికులు రక్షించుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.
వెంటనే స్థానికులు జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో గాలింపు చేపట్టిన జీహెచ్‌ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు.. సికింద్రాబాద్‌లోని పార్క్ లేన్ సమీపంలోని నాలాలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం చిన్నారి మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మౌనిక మృతితో చిన్నారి కుటుంభంలో విషాధచాయలు అలుముకున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు మండిపడుతున్నారు.