హైదరాబాద్- గ్యాంగ్ స్టర్ నయీం కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. గత ఐదేల్లుగా నయీం కేసు విచారణ జరుగుతున్నా పెద్దగా పురోగతి కనిపించడం లేదు. నయీం ఎన్ కౌంటర్ జరిగిన కొత్తలో ఉన్న హడావుడి ఆ తరువాత చల్లబడిపోయింది. ఇప్పుడు నయీం కేసు ఏమైందో కూడా ఎవ్వరికి తెలియదు. ఇదిగో ఇటువంటి సమయంలో నయీం కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది.
గ్యాంగ్ స్టర్ నయీం కేసులో కమిషన్ ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ప్రధాని మోదీ, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖలు రాయడం ఆసక్తి రేపుతోంది. నయీం ఎన్‌కౌంటర్ కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ విచారణ ఆశాజనకంగా సాగడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రెటరీ పద్మనాభ రెడ్డి అభిప్రాయపడ్డారు.
నయీం ఎన్‌కౌంటర్ జరిగి ఐదు సంవత్సరాలు పూర్తైనా ఇప్పటికీ కేసు విచారణ కొలిక్కిరాలేదని పద్మనాభ రెడ్డి అన్నారు. నయీం నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి అనేక అక్రమాలకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. ఇలాంటి గ్యాంగ్ స్టర్ కేసుల్లో సమగ్ర విచారణ జరగకపోతే, నయీం లాంటి గ్యాంగ్ స్టర్స్ మళ్లీ పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని పద్మనాభ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
నయీం ఎన్ కౌంటర్ తరువాత పరారీలో ఉన్న ఆయన వ్యక్తిగత అనుచరులను ఇప్పటి వరకు ఎందుకు పోలీసులు పట్టుకోలేక పోయారని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్ల క్రితం నయీం ఎన్‌కౌంటర్ తరువాత, అతని ఇంట్లో పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు, డైరీలు, నగలు, నగదు లభ్యమైందని పద్మనాభ రెడ్డి గుర్తు చేశారు. వేలాది ఎకరాల భూములకు సంబంధించిన 340 డాక్యుమెంట్లు, భారీగా నగలు, పేలుడు పదార్థాలు, 24 తుపాకులు, బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్స్, డబ్బు స్వాధీనం చేసున్నారని ఆయన చెప్పారు.
నయీం ఇంట్లో లభించిన డైరీల వ్యవహారం ఎందుకు బయటపెట్టడం లేదని పద్మనాభ రెడ్డి ప్రశ్నించారు. డైరీలు బయటపెడితే రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లు బయటిపడతాయని పద్మనాభరెడ్డి వ్యాఖ్యానించారు. మరి ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ ఎలా స్పందిస్తారన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతోంది.