అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్‌ను పాకిస్తాన్ ఆర్మీ అరెస్టు చేసింది. ఇస్లామాబాద్ కోర్టులో హాజరు పరిచిన తరువాత ఆర్మీ ఆయన్ను అదుపులోకి తీసుకుంది.
మాజీ క్రికెటర్, పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మంగళవారం అరెస్టు అయ్యారు. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్‌ను పాకిస్తాన్ ఆర్మీ అరెస్టు చేసింది. ఇస్లామాబాద్ కోర్టులో హాజరు పరిచిన తరువాత ఆర్మీ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీకి చైర్మన్ అయిన ఆయన 2018లో దేశ 22వ ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే ప్రధానిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆయన అరెస్టు చేస్తుండగా కోర్టులో ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ఇమ్రాన్ ఖాన్ లాయర్లకు గాయాలయ్యాయి.
ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసినట్లు పిటిఐ పార్టీకి చెందిన ఫవాద్ చౌదరి మంగళవారం ఒక ట్వీట్‌లో ధృవీకరించారు. ఇస్లామాబాద్ హైకోర్టు కాంప్లెక్స్‌ను పాకిస్థాన్ రేంజర్స్ పారామిలటరీ ఆక్రమించిందని, న్యాయవాదులు హింసకు గురయ్యారంటూ చౌదరి ట్వీట్ చేశారు. అరెస్టు అనంతరం ఇమ్రాన్ ఖాన్‌ను రహస్య ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ ప్రముఖుల నుండి బహుమతులు పొందడమే కాకుండా.. వాటిని అక్రమంగా అమ్మినట్లు తేలింది. ఈ ఆరోపణలపై గతంలోనే ఆయన అరెస్టు కావాల్సి ఉండగా.. కోర్టు అడ్డుకుంది.