హనుమాన్ జంక్షన్- మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉమను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో జూమ్ యాప్ ద్వారా.. ఆయనను ఆన్ లైన్‌లో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. దేవినేని ఉమకు మైలవరం జడ్జి షేక్ షేరిన్ 14 రోజులు రిమాండ్ విధించారు. హనుమాన్ జంక్షన్ నుంచి దేవినేని ఉమను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మంగళవారం రాత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు.
మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ జరుగుతోందంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది. దానిని పరిశీలించేందుకు దేవినేని ఉమ సహా టీడీపీ బృందం వెళ్ళింది. ఆ సమయంలో జి కొండూరు వద్ద వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నాయకుడి కారు ఒకటి ధ్వంసం అయ్యింది. దేవినేని ఉమా కారు అద్దాలు పగిలాయి. నిందితులను అరెస్ట్ చేయాలంటూ దేవినేని ఉమా జి కొండూరు పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు.
దేవినేని ఉమామహేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా గొడవలను రెచ్చగొట్టారని, జి.కొండూరు ఘర్షణకి ఆయనే ప్రధాన కారణం అని డీఐజీ మోహన్ రావు చెప్పారు. ఆయన ముందస్తు పథకంతో, కొండపల్లి వెళ్లి అక్కడ అనుచరులను కలుపుకున్నారని వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని అన్నారు. టీడీపీ నాయకులు మీడియాలో హడావిడి చేయడం కూడా ప్లాన్‌లో భాగమేనని, దీనికి సంబంధించి దేవినేని ఉమపై కేసు నమోదు చేశామని డీఐజీ మోహనరావు తెలిపారు.
దేవినేని ఉమపై మొత్తంగా 12 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 158, 147, 148, 341, 323, 324, 307, 427, 506, 353, 332, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంతకు ముందు భారీ భద్రత మధ్య దేవినేని ఉమను మైలవరం కోర్టుకు తరలించారు. ఉమను కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. పోలీసు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.