భద్రాద్రి కొత్తగూడెం- తెలంగాణలో ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ పట్ల ఫారెస్ట్ గార్డ్ దారుణంగా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అడవిలో కట్టెలు ఏరుకునేందుకు వెళ్లిన గిరిజన యువతిని ఫారెస్ట్ గార్డు బట్టలూడదీసి కొట్టిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
అడవిలో కట్టెలు తెచ్చుకునేందుకు వెళ్లిన తమపై ఫారెస్ట్ గార్డు దాడి చేశాడని బాధితులు ఆరోపించారు. ఈ అమానుష ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారింది. ములకలపల్లి మండలం మారుమూల గ్రామమైన సాకి వాగు వలస గ్రామానికి చెందిన నలుగురు గిరిజన యువతులు వంటకోసం కట్టెల తెచ్చుకునేందుకు అడవిలోకి వెళ్లారు.
అక్కడ అడవిలో విధులు నిర్వహిస్తున్నా ఫారెస్ట్ గార్డ్ మహేశ్ ఆ నలుగురు యువతుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. గార్డు యువతుల వెంట పడి తరమడంతో పాటు, వారిని కర్రతో విచక్షారహితంగా కొట్టాడు. ఆ గార్డ్ నుంచి తప్పించుకుని పరిగెత్తే క్రమంలో ఓ యువతి సమీపంలోని పెద్ద గుంతలో పడిపోవడంతో ఆమెకు గాయాలయ్యాయి.
అంతటితో వదిలిపెట్టని గార్డ్, మరో యువతిని నిలువరించిన ఆమె బట్టలు ఊడదీసి కొట్టినట్లు తెలుస్తోంది. తన దుస్తులు తీసేసి కొట్టాడని బాధితురాలు చెప్పడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై గిరిజన, ఆదివాసీ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అమానుషంగా ప్రవర్తించిన గార్డుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అటవీశాఖ అధికారులు ఇప్పటికే ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.