ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికిగాను భారీగా నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా మనబడి నాడు-నేడు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పనుల్లో నాణ్యత ప్రమాణాలను గాలికి వదిలేశారు. తూతూమంత్రంగా మరమ్మతులు చేస్తున్నారు. మరోవైపు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో కొన్ని ప్రాంతాల్లో పనులే ముందుకు కదలడం లేదు. వారం రోజుల వ్యవధిలో రెండుచోట్ల స్కూళ్ల పైకప్పు పెచ్చులూడిపడటంతో నాడునేడు పనులపై విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. కర్నూల్ జిల్లా సి.బెళగల్ మండలం ‘బురాన్ దొడ్డి’ ప్రాధమిక పాఠశాలలో కలకలం రేగింది. క్లాస్ రూమ్ లో పాఠాలు వింటున్న అయిదవ తరగతి విద్యార్థులపై స్లాబ్ పెచ్చులూడి పడటంతో నలుగురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మహీధర్ అనే విద్యార్థికి తలపగిలింది. రక్తస్రావం కావడంతో అతడ్ని తరలించారు. విద్యార్ధి మహీధర్ తలకు ఐదుకుట్లు పడ్డాయి.
వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పనుల్లో డొల్లతనం బయటపడటంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి నాడు-నేడు పనులను జాతికి అంకితం చేసి విద్యాసంవత్సరాన్ని ప్రారంభించారు. ఇసుక, సిమెంటు, కాంక్రీటు మిశ్రమంలో కొలతల పరిమాణం తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ పలు ప్రాంతాల్లో నిబంధనలు తుంగలో తొక్కి స్థానికంగా లభించే నాణ్యత లేని కంకరను తీసుకొచ్చి పనులు ముగిస్తున్నారు. నాడు-నేడు నిర్మాణ పనులను ఇష్టానుసారంగా చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఫ్లోరింగ్‌కు ఇసుక, సిమెంటు, కాంక్రీటును యంత్రం ద్వారా మిశ్రమం చేయాల్సి ఉంటుంది. పైపైన పనులు చేయిస్తూ నిధులు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
ప్రకాశం జిల్లా మార్కాపురంలోనూ ఇదే తరహాలో ప్రమాదం జరిగి ఓ విద్యార్ధి నిండుప్రాణం బలైంది. మార్కాపురం మండలం రాజుపాలెంలో గత నెల 29వ తేదీన స్కూలుకు సెలవు దినం కావడంతో ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్ లో గ్రామానికి చెందిన పిల్లలు ఆడుకుంటున్నారు. విష్ణు అనే 7వ తరగతి విద్యార్థి క్లాస్ రూమ్ కు వెళ్లి ఒక్కడే కూర్చున్నాడు. అదే సమయంలో పైకప్పు కూలింది. దీంతో విష్ణు తీవ్రంగా గాయపడ్డాడు. పెద్దలు వచ్చి గమనించేలోపు మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.