రాజస్థాన్- ఒక ఇంట్లో ఒకరు కలెక్టర్ అయితే ఆ హంగామా అంతా ఇంతా కాదు. అదే కొత్తగా ఆ కుటుంబంలో సందడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ కాలనీలో ఒకరు కలెక్టర్ ఐతే ఆ వీధి అంతా సంబంరాలు చేసుకుంటారు. కలెక్టర్ కావడం అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. కానీ ఒకే కుటుంబంలోని వారంతా కలెక్టర్లు అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఇది ఊహించుకోవడానికే కొత్తగా ఉంది కదా. కానీ ఒకే కుటుంబంలో ఏకంగా ఐదుగురు కలెక్టర్లు అయిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.
రాజస్తాన్‌లోని హనుమాఘర్‌లో 2018లో నిర్వహించిన రాజస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష ఫలితాలు మంగళవారం ప్రకటించారు. ఈ పరీక్షల్లో అన్షు, రీతు,సుమన్‌లకు రాజస్తాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కు ఎంపికై అందర్ని ఆశ్చర్యానికి గురి చేశారు. ఎందుకంటే వీరు ముగ్గురు సొంత అక్కా చెల్లెల్లు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇప్పటికే ఆ ఇంట్లో రోమా, మంజులు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు.
తాజాగా మరో ముగ్గురు అక్కాచెల్లెల్లు కూడా ఆర్‌ఎఎస్‌కు ఎంపిక కావడంతో ఆ ఇంట్లో ఇప్పుడు అందరూ కలెక్టర్లుగా రికార్డు సృష్టిస్తున్నారు. కొత్తగా ఆర్‌ఎఎస్‌కు ఎంపికైన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఫోటోలను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కష్వాన్ షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ కు చెందిన సహదేవ్ సహరన్ సాదాసీదా మధ్య తరగతి కుటుంబానికి చెందిన రైతు.
ఆయనకు ఐదుగురు ఆడపిల్లలు. కొడుకులు లేరని ఏనాడు కుంగిపోని సహదేవ్ కు కలెక్టర్ కావాలన్న కోరిక ఉండేదట. ఆ విషయాన్ని తన కుమార్తెలకు చెప్పారాయన. దీంతో తండ్రిని అర్థం చేసుకున్న కుమార్తెలు ఎంతో కష్టపడి ఉన్నత చదివారు. ముందు ఇద్దరు కూతుళ్లు కలెక్టర్లు కాగా, తాజాగా ముగ్గురు కూతుళ్లు కూడా కలెక్టర్లు కావడంతో ఇక ఆ తండ్రి ఆనందానికి అంతే లేదు.