ఆంద్రప్రదేశ్- విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింంది. విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. హెచ్‌పీసీఎల్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాద సమయంలో కంపెనీ సిబ్బంది మూడు సార్లు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్‌పీసీఎల్ పరిసర ప్రాంత ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ప్రమాద సమయంలో సేఫ్టీ సైరన్ మోగడంతో ఉద్యోగులు పరుగులు తీశారు. భారీ శబ్ధం రావడంతో స్థానికులు స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 100 మంది ఉద్యోగులు ఉన్నారని చెబుతున్నారు.
ఐతే వారంతా క్షేమంగా ఉన్నారని సమాచారం. ఎటువంటి ప్రాణహాని, గాయాలు జరగకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఐతే ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రమాదంపై హెచ్ పీసీఎల్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. నిపుణులను రంగంలోకి దింపి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటన, ఆ తరువాత పరవాడలోని రాంకీ పరిశ్రమలో అగ్నిప్రమాదం మరవకముందే ఇప్పుడు హెచ్ పీసీఎల్ లో ప్రమాదం జరగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన కంపెనీలను జనావాసాల నుంచి దూరంగా తరలించాలని విశాఖ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.