అదృష్టం కొందర్నిఅందలానికి ఎక్కిస్తుంది.దురదృష్టం ఎంతటి వారినైనా పతనం వైపు నడిపిస్తుంది.విధి మనిషితో వక్రం గా ఆడుకున్నా ఎంతటి ప్రమాదంలో పడేసినా,భాగ్యవశాన అదృష్టం కొందరిని తిరిగి మామూలు స్థితికి చేరేలా చేస్తుంది.బ్రతికి ఉండటం కన్నా చనిపోవటం మేలు అనిపించే స్థితి నుండి తిరిగి బ్రతకాలనే ఆశ చిగురింప చేసిన యదార్ధ సంఘటన ఇది.
మరణం చివరి అంచులదాకా వెళ్ళిన అతనికి దేవుడు లాంటి వైద్యుని చికిత్స..ఆదుకున్నదాతల అనుగ్రహం తో పోగొట్టుకున్న రెండు చేతులను ఎలా పొందాడో ..అతనికి జరిగిన విషాద సంఘటన ఏమిటో చదివితే తెలుస్తుంది !
అతడు తన రెండు చేతులను కోల్పోయాడు. సుమారు 23 ఏళ్ల తర్వాత ఓ వైద్యుడి వల్ల మళ్లీ చేతులను పొందాడు.రెండు చేతులు లేకపోతే పనులు చేసుకోవడం ఎంత కష్టమో తెలిసిందే. ఇన్ఫెక్షన్ లేదా ప్రమాదాల వల్ల చేతులు పోగొట్టుకొనే వ్యక్తుల భవిష్యత్తు చీకటిమయం అవుతుంది. కేవలం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేవారు మాత్రమే ధైర్యంగా జీవించగలరు. కాళ్లను సైతం చేతులుగా మలచుకుని తమ పనులు తామే చేసుకోగలరు. కానీ, అలా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వ్యక్తుల కోసం ప్రస్తుతం ఎన్నో రకాల ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ వస్తున్నాయి. అయితే, అవి మన చేతులంత సమర్థంగా పనిచేయవు. దీంతో ఆ లోటు అలాగే ఉంటుంది.
ఐస్‌లాండ్‌కు చెందిన ఈ వ్యక్తి గురించి చదివితే.. చేతుల్లేని వ్యక్తుల్లో ఆశలు చిగురిస్తాయి. ఓ ప్రమాదంలో పూర్తిగా రెండు చేతులను కోల్పోయిన అతడికి మళ్లీ చేతులు వచ్చాయి. సర్జరీ ద్వారా ఓ దాత చేతులను విజయవంతంగా అమర్చి ఔరా అనిపించారు. కోపవోగుర్‌లో నివసిస్తున్న 49 ఏళ్ల ఫెలిక్స్ గ్రెటార్సన్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. 1998లో ఓ పవర్ లైన్ మీద పనిచేస్తున్న సమయంలో అకస్మా్త్తుగా విద్యుద్ఘాతానికి గురయ్యాడు. దీంతో అతడి రెండు చేతులు కాలిపోయాయి.
ఈ ప్రమాదం తర్వాత ఫెలిక్స్ సుమారు మూడు నెలలు కోమాలోకి జారుకున్నాడు. డాక్టర్లు అతడికి 54 సార్లు సర్జరీలు జరిపినా ఫలితం లేకపోయింది. గాయాలు చాలా తీవ్రంగా ఉండటంతో..అతడి ప్రాణాలు కాపాడేందుకు రెండు చేతులు తొలగించారు. 2007లో ఫెలిక్స్ టీవీలో ఓ ప్రకటన చూశాడు. ఐస్‌ల్యాండ్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ జీన్ మైఖెల్ డ్యుబెర్నార్డ్ 1998లో విజయవంతంగా ఓ వ్యక్తికి మరోకరి చేతులను అమర్చినట్లు తెలిపారు. దీంతో ఫెలిక్స్‌లో ఆశలు చిగురించాయి. అయితే, ఆ సర్జరీ కోసం ఫ్రాన్స్ వెళ్లాల్సి వస్తుందని తెలిసి కాస్త సంకోచించాడు. అయితే, తన సమస్యను వివరిస్తూ వైద్యుడికి దరఖాస్తు చేసుకున్నాడు.
నాలుగేళ్ల తర్వాత సర్జన్ జీన్ అతడికి ఆపరేషన్ చేయడానికి అంగీకరించాడు. దీంతో ఫెలిక్స్ ఫండ్ రైజింగ్ ద్వారా ఆపరేషన్‌కు అవసరమైన నిధులను సమకూర్చాడు. ఆ సొమ్ముతో ఈ ఏడాది జనవరి 12న రెండు చేతులకు సర్జరీ నిర్వహించారు.సుమారు 15 గంటల సేపు జరిగిన ఈ సర్జరీలో దాత డొనేట్ చేసిన చేతులను ఫెలిక్స్ భుజాలకు అమర్చారు.
ఆ తర్వాత వైద్యులు వందలాది గంటలు అతడితో అనేక రకాల వ్యాయామాలు చేయించారు.ఫలితంగా అతడు ఆ చేతులను కదపగలిగాడు.ఇప్పుడు అతడు ‘కొత్త’ చేతులతో తన భార్య, పిల్లలను, మనవళ్లను అప్యాయంగా హత్తుకొనే రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం ఫెలిక్స్ చేతికి పూర్తిగా స్పర్శను పొందలేకపోతున్నాడు.అతడి చేతిలోని నరాలు రోజుకు మిల్లీమీటర చొప్పున పెరుగుతాయని, ఏడాదిలో అవి అతడి మోచేతి వరకు చేరతాయని డాక్టర్లు తెలిపారు.
ఆ తర్వాత అతడు అన్ని రకాల స్పర్శలను పొందగలడని పేర్కొన్నారు.వైద్యో నారాయణో హరిః అన్నారు అందుకే..ఈ ప్రపంచం లో సృష్టికి ప్రతిసృష్టి చేసే శక్తి వైద్యులకి మాత్రమే ఉందనటంలో సందేహం లేదని నిరూపించారు.