ఇంటర్నేషనల్ డెస్క్- పిల్లలు తప్పిపోవడం, కొన్ని సందర్బాల్లో కిడ్నాప్ కు గురవ్వడం చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఐతే చాలా వరకు తప్పిపోయిన పిల్లలు దొరకడం, కిడ్నాప్ ఐన పిల్లలను పోలీసులు రక్షించడం జరుగుతుంటుంది. కానీ మరి కొన్ని సందర్బాల్లో తప్పిపోయిన, కిడ్నాప్ అయిన తమ పిల్లల కోసం తల్లిదండ్రులు వెతుకుతుంటారు. ఎంతకీ దొరకకపోతే మాత్రం కన్నీళ్లు పెట్టుకుని ఇక లాభం లేదని ఊరుకుంటారు.
ఐతే ఓ తండ్రి మాత్రం రెండేళ్ల వయసులో కిడ్నాపైన తన కన్న కొడుకు కోసం ఏకంగా 24 సంవత్సరాల పాటు వెతికాడు. ఈ క్రమంలో అతుడు సుమారు 5లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణం చేశాడు. కన్న కొడుకు కోసం ఆ తండ్రి పట్టుదల చూసి దేవుడు కరుణించాడు. 24 ఏళ్ల తరువాత తన కన్న కొడుకును కనిపెట్టాడా తండ్రి. ఉత్కంఠభరితమైన ఈ సంఘటన చైనాలో జరిగింది.
చైనాలోని షాన్ డాంగ్ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన గువా గాంగ్ టాంగ్ రెండేళ్ల వయసున్న కొడుకును 1997లో గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి తన బిడ్డ కోసం దేశమంతా వెతుకుతూనే ఉన్నాడు. పట్టువదలని విక్రమార్కుడిలా దేశం మొత్తం గాలించాడా తండ్రి. ఈ క్రమంలో గాంగ్ టాంగ్ పలు ఇబ్బందులు పడ్డాడు. చాలా సార్లు రోడ్డు ప్రమాదాలకు గురయ్యాడు. హృదయవిదారకరమై ఈ గాంగ్ టాంగ్ కథ తెలుసుకున్న ఓ సినీ దర్శకుడు అతడి ప్రయాణంపై ఓ సినిమానే తీశాడు. ఆ సినిమాలో భారీ విజయం సాధించింది.
దాదాపు 24 ఏళ్ల గాలింపు తరువాత గాంగ్ టాంగ్ శ్రమ ఫలితం దక్కింది. ఎట్టకేలకు ఆ తండ్రి తన కొడుకుని కలుసుకున్నాడు. అయితే ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న ఆ యువకుడు తన కన్న కొడుకా, కాదా అన్న అనుమానం ఆ తండ్రితో పాటు, అందరికి కలిగింది. దీంతో అధికారులు వారిద్దరికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించగా, వారిద్దరు తండ్రీ కొడుకులని తేలిపోయింది. ఇంకేముంది ఆ తండ్రి తన కన్న కొడుకుని హత్తుకుని కన్నీటిపర్వంతం అయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.