దేశంలో కరోనా కష్టకాలంలో ఎంతో మంది చేయడానికి సరైన పనులు లేక ఇంటి పట్టున ఉన్న పరిస్థితి నెలకొంది. అదే సమయంలో కొంత మంది ఔత్సాహికులు తమ టాలెంట్ ని చూపిస్తూ ఎన్నో వినూత్న ప్రయోగాలు చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మంచి గుర్తింపు సంపాదించారు. ఓ రైతు లాక్ డౌన్ సమయంలో రెండు సంవత్సరాలు కష్టపడి విద్యుత్ బైకును తయారుచేసి అందరిచే షభాష్ అనిపించుకున్నాడు. అయితే ఆ రైతు చదివింది పదవతరగతి.. కానీ ఓ పెద్ద ఇంజనీర్లు చేసినంత గొప్ప పనిచేసి ఔరా అనిపించాడు. కేవలం రూ.14 ఖర్చుతో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసే ఎలక్ట్రిక్ బైక్ ని తయారు చేశాడు. ఆ బైక్ ప్రత్యేకతలు ఏంటో చూద్దామా..
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఏ రేంజ్ లో పెరిగిపోయాయో అందరికీ తెలిసిందే. కొంత మంది వాహనాలు బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన ధ్యానేశ్వర్ ఉమాజీరావ్ కల్యాంకర్ అనే 30 ఏళ్ల రైతు విద్యుత్ బైక్‌ను రూపొందించాడు. కేవలం రూ.14 ఖర్చుతో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసేలా దీన్ని తయారు చేశాడు.పింపలగాన్ మహాదేవ్ సమీపంలోని అర్థాపుర్ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్ అతని సోదరుడితో కలిసి పూల మెుక్కలు సాగు చేస్తున్నాడు. వీటిని మార్కెట్‌కి రవాణా చేయడానికి రోజుకు రూ.250 ఖర్చు అయ్యేది. తనకు వచ్చే లాభం సగం తన పెట్రోల్ కే సరిపోతుందని బాధపడుతున్న సమయంలో అతనికి ఓ చక్కటి ఆలోచన వచ్చింది. దీంతో ఖర్చు తగ్గించుకునేందుకు వినూత్న ఆలోచన చేసి ఎలక్ట్రిక్ బైక్‌ను తీర్చిదిద్దాడు.
కాగా,లాక్డౌన్ సమయంలో రెండు సంవత్సరాలు కష్టపడి ఈ విద్యుత్ బైకును తయారుచేశాడు ధ్యానేశ్వర్. ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీకి రూ.26,000 అవుతుంది. 750 వోల్ట్ కెపాసిటీ గల మోటార్, 48 వోల్ట్ బ్యాటరీ, ఛార్జర్, కంట్రోలర్, లైట్, ఎలక్ట్రిక్ బ్రేక్ ఉంటాయి. కేవలం 4 గంటలు ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీనికి రూ.14 మాత్రమే ఖర్చు అవుతుంది. అయితే దీనిపై సుమారు 300 కేజీల బరువును తీసుకెళ్లవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ తయారీ కోసం ధ్యానేశ్వర్ సుమారు రూ.40 వేల ఖర్చు అయ్యిందట. ఎవరైనా తనకు ఆర్థికంగా సహాయం చేస్తే మరిన్ని ప్రయోగాలు చేసి గ్రామానికి పనికి వచ్చే వస్తువులు తయారు చేస్తా అని అంటున్నాడు ధ్యానేశ్వర్ ఉమాజీరావ్.