దీంతో మనస్తాపానికి గురైన అతడు పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఎంత బతిమాలినా అతడు కిందకు దిగిరాలేదు.
మనకు సమస్య వచ్చినపుడు దాన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తాం. పరిష్కారం మన చేతుల్లో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సమస్య నలుగురితో ముడిపడి ఉన్నది అయితే దాన్ని తీర్చటానికి కష్టపడక తప్పదు. అలా కష్టపడ్డా ఫలితం ఉంటుందన్న లాభం లేదు. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఓ పట్టాన తీరవు. ఏళ్లు గడుస్తున్నా కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు చాలా మంది ఉన్నారు. తాజాగా, ఓ వ్యక్తి ఆస్తి తగాదాల విషయంలో విసుగు చెంది ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఏకంగా కరెంట్ స్తంభం ఎక్కాడు. దీంతో అక్కడ పెద్ద రచ్చ జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి, ఆపసోపాలు పడితే గానీ అతడు కిందుకు దిగిరాలేదు.
ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా, ముస్తాబాద్ మండలంలోని సేవాలాల్ తండాకు చెందిన దరంసోత్ రవి, బాలరాజు అన్నదమ్మల పిల్లలు. ఓ భూమి రిజిస్ట్రేషన్ విషయమై రవి, బాలరాజుల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. పంచాయతీ పెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. ఇద్దరి మధ్యా నివురు గప్పిన నిప్పులా గొడవ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం రవి తన పొలంలో వేసిన వరి పంటను కోసేందుకు వెళ్లగా.. బాలరాజు అడ్డుకున్నాడు. సమస్య తీరేంత వరకు వరి పంట కోయటానికి వీల్లేదని అన్నాడు. దీంతో మరోసారి ఇద్దరి మధ్యా గొడవ జరిగింది.
భూమి తనకు రావటం లేదని బాలరాజు మనస్తాపానికి గురయ్యాడు. ఆ వెంటనే పక్కనే ఉన్న కరెంట్ స్తంభం ఎక్కాడు. స్థానికులు ఎంత చెప్పినా అతడు కిందకు దిగలేదు. కరెంట్ ఆఫీస్‌కు ఫోన్ చేసి కరెంట్‌ను ఆఫ్ చేయించారు. ఆ వెంటనే పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి అతడ్ని కిందకు దింపే ప్రయత్నం చేశారు. అయినా అతడు వినలేదు. దీంతో ఓ కానిస్టేబుల్ ‘‘ నీకు దండం పెడతా దిగన్నా.. నీ పిల్లలు ఆగమైతరు’’ అని అనటంతో బాలరాజు కిందకు వచ్చాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.