హైదరాబాద్- తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డికి వింత అనుభవం ఎదురైంది. ఆయన పేరు మీద సోషల్ మీడియాలో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి గందరగోళం సృష్టిస్తున్నారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. తన పేరుపై క్రియోట్ చేసిన ఫేక్ అకౌంట్ లో ఏకంగా అందమైన అమ్మాయిల ఫోటోలు ప్రత్యక్ష్యం అవ్వడంతో జగ్గారెడ్డి అవాక్కయ్యారు.
జగ్గా రెడ్డి తూర్పు పేరుతో ఉన్న ఈ ఫేస్ బుక్ అకౌంట్ లో అందాలు ఒలకబోస్తూ యువతి ఫొటోలు ఉండడం కలకలం రేపుతోంది. బీచ్ ఒడ్డున విల్లా ఫొటోలు, యువతి ఫొటోలు కనిపించడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. జగ్గా రెడ్డి పేరుతో అకౌంట్ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇది తన అకౌంట్ కాదని, సంగారెడ్డి ప్రజలెవరూ అది నమ్మి మోసపోవద్దని జగ్గారెడ్డి తెలిపారు.
తన పేరును డ్యామేజ్ చేసేందుకే ప్రత్యర్ధులు కావాలని ఇలా చేస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని, ఆ అకౌంట్ నుంచి మెసేజ్లు చేస్తే పట్టించుకోవద్దని ఆయన చెప్పారు. ఈ వ్యవహారాన్ని కాస్త సీరియస్ గా తీసుకున్న జగ్గారెడ్డి, ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో నెలకొన్న వివాదంలోనూ కొందరు పనిగట్టుకుని తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని గతంలో ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. కొందరికి సోషల్ మీడియా అభిమానులున్నారని, వారితోనే సమస్యలు వస్తున్నాయని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.