చిత్తూరు రూరల్- గుప్త నిధుల కోసం చాలా కాలంగా చాలా ప్రాంతాల్లో వెతుకుతుంటారు. ఎక్కడో చాలా అరుదుగా గుప్తనిధులు బయటపడుతుంటాయి. కానీ కొందరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు, దొంగ స్వాములు గుప్తనిధుల ఆశ చూపి మోసం చేస్తుంటారు. గుప్తనిధులకోసం తవ్వకాలు జరిపి నిరాశ చెందుతుంటారు చాలా మంది. అంతే కాదు ఒక్కోసారి పోలీసులకు చిక్కి కటకటాలపాలవుతుంటారు కూడా. ఇదిగో చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది.
చిత్తూరు జిల్లాలో గుర్రంకొండ కండ్రిగ పంచాయతీలోని పురాతన మగ్బీర డూమ్‌లో నవాబ్ మీర్ రజా అలీఖాన్ సమాధి ఉంది. గుర్రంకొండ ప్రాంతాన్ని గతంలో టిప్పు సుల్తాన్ చక్రవర్తిగా పరిపాలించారు. ఆ సమయంలోనే గుర్రంకొండ ప్రాంతం ఎన్నో చారిత్రక కట్టడాలు కట్టించారు. టిప్పు సుల్తాన్ మేనమామ మీర్ రాజా అలీ ఖాన్ అక్కడే జీవించారు. ఆయన చనిపోయాక ఇక్కడే సమాధి కట్టారు.
ఈ సమాధిలో కోట్ల రూపాయల విలువైన గుప్తనిధులు ఉన్నాయని కొంతమంది తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో నమాజ్ చేయడానికి సమాధి నిర్వాహకుడు మీర్ మగ్దూం అలీఖాన్ డూమ్ తలుపులు తెరిచి, అక్కడ తవ్వకాలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ ఎగువతొట్లివారిపల్లెలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
మరో 8 మంది పరారీలో ఉన్నారని పోలీసులు గుర్తించారు. వీరంతా కలిసి నకిలీ తాళంతో సమాధి తలుపులు తెరిచి, వారం రోజుల పాటు రాత్రి వేళ 20 అడుగుల మేర తవ్వకాలు జరిపారు. గుప్త నిధుల తవ్వకాల ముఠా సభ్యుల్లో టిప్పు సుల్తాన్ కుటుంబానికి చెందిన వారసుడు ఉండడం కలకలం రేపుతోంది. కండ్రిగకు చెందిన మీర్ మగ్దూమ్ అలీఖాన్ కుమారుడైన మీర్ ముఖద్దీర్ అలీఖాన్ బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
కరోనా పరిస్థితుల నేపధ్యంలో కొంత కాలంగా స్వగ్రామంలో ఉంటూ వర్క్ ఫ్రంహోం చేస్తున్నాడు. అతడి ద్వారా సమాధి తలుపుల తాళం తీసుకుని, దాని ద్వారా నకిలీ తాళం చేయించుకున్నట్లు పోలీసులు చెప్పారు. 7 రోజుల పాటు రాత్రిపూట తవ్వకాలు చేపట్టినట్లు పోలీసుల విచారణలో నిందితులు చెప్పారు. వారికి పరోక్షంగా సహకరించిన మీర్ ముఖద్దీన్ అలీఖాన్‌పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.