అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పడుతున్నారు. గత కొన్ని రోజులుగా పీఆర్సీ విషయంలో జగన్ సర్కార్ కు, ఉద్యోగులకు మధ్య వివాదం చలరేగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ సరిపోదని, దానిపై పునరాలోచించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుండగా, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకుని సర్దుకు పోవాలని జగన్ సర్కార్ చెబుతోంది.
ఇదిగో ఇటువంటి సమయంలో తాము ప్రకటించిన కొత్త పీఆర్సీ మేరకు ప్రభుత్వం ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జీతాలను జమ చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు మరోసారి చర్చలు జరిపాయి. ఐతే ఈ చర్చలు విఫలమయ్యాయి. తాము చెప్పిన అంశాల పరిష్కారం సాధ్యపడదని మంత్రుల కమిటీ చెప్పిందని ఏపీ ఎన్జీఓ నేతలు చెప్పారు.
ప్రభుత్వంతో చర్చల కార్యచరణ విఫలమైందని, చలో విజయవాడ విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా కలెక్టర్లు ఉద్యోగులను భయపెట్టవద్దని కోరారు. నిర్బంధంగా కొత్త పే స్కేల్ తో వేతనాలు ఖాతాల్లో వేయడాన్ని వారు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శించారు.
బలవంతపు నిర్బంధ వేతన సవరణను నిలుపుదల చేయాలని మంత్రుల కమిటీని సైతం కోరారు ఉద్యోగులు. వేతనాలకు సంబంధించి మార్చి 31 వరకు అమలు చేయాలని గతంలో ఉత్తర్వులు ఇచ్చి, మళ్లీ రాత్రికి రాత్రే వాటిని ఎలా అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ఆర్థిక అంశాలపై స్లైడ్లు వేసి ఉద్యోగులను అవమాన పరిచారని మండిపడ్డారు. చర్చలని చెప్పి మంత్రుల కమిటీ మళ్లీ ఉద్యోగుల డిమాండ్లను దాట వేసే ప్రయత్నం చేస్తోందన్నారు.