స్పెషల్ డెస్క్- ఈ కాలంలో కుటుంబ బంధాలు కనుమరుగైపోతున్నాయి. ఒకప్పుడు ఉన్న పెద్ద ఫ్యామిలీలు ఇప్పుడు చిన్ని కుటుంబాలుగా మారిపోతున్నాయి. అందులోను అన్నా తమ్ములు, అక్కా చెల్లి మధ్య ప్రేమలు అంతకంతకు అంతరించిపోతున్నాయి. ఇదిగో ఇటువంట సమయంలో ఓ చెల్లికి అన్న ఏకంగా గుడినే కట్టిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
నెల్లూరు జిల్లాలో వల్లేట్ చంద్రశేఖర్ కు ఐదుగురు సంతానం. అందులో నాలుగవ సంతానం ఆడపిల్ల పుడితే ఆమెకు శుభ లక్ష్మి అని పేరు పెట్టారు. ఆమె పెరిగి పెద్దై, డిగ్రీ వరకు చుదువుకుని అటవీ శాఖలో ఉద్యోగం కూడా సంపాదించింది. ఓ రోజు అన్న వరప్రసాద్ తో కలిసి బైక్ పై ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో శుభ లక్ష్మి అక్కడికక్కడే చనిపోయింది.
ఆమె అన్న వరప్రసాద్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. శుభ లక్ష్మి చనిపోయిన కొన్నాళ్లకు తండ్రి చంద్రశేఖర్ కలలో వచ్చి, తనకు గుడి కట్టాలని, అలా ఐతే తాను ఎప్పటికీ ఇంట్లోనే ఉంటానని చెప్పింది. ఈ విషయాన్ని వరప్రసాద్ కు చెప్పడంతో, కుటుంబ సభ్యులందరితో ఆలోచించి శుభలక్ష్మికి గుడి కట్టారు. 2011 లో ఆమె విగ్రహం తయారు చేయించి, శుభ లక్ష్మికి ఆలయం నిర్మించి నిత్యం పూజలు చేస్తున్నారు.
ప్రత్యేకంగా ఆమె అన్న వరప్రసాద్ అను నిత్యం చెల్లి శుభ లక్ష్మికి పూజలు చేస్తున్నారు. ఉదయం సాయంత్రం హారతి ఇచ్చి, కొబ్బరి కాయ కొడుతున్నారు. ఇక ప్రతి సంవత్సరం శుభ లక్ష్మి జయంతి రోజు అన్న దాన కార్యక్రమాలు చేస్తూ, నిరుపేదలకు వస్త్రాలను దానం చేస్తున్నారు వరప్రసాద్. ఇక తన చెల్లి శుభ లక్ష్మికి మొక్కి ఏ పని చేసినా సక్సెస్ అవుతుందని, తమ కుటుంబానికే కాకుండా గ్రామంలోని వారు కూడా ఈ విషయాన్ని నమ్ముతారని వరప్రసాద్ చెబుతున్నారు.