దుబాయ్- మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ గురించి కొత్తాగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే వాళ్లిద్దరు మలయాళ సినీ పరిశ్రమకు రెండు కళ్లలాంటివారు. అంతే కాదు మోహన్ లాల్, మమ్ముట్టి ఇద్దరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. వారిద్దరు చాలా తెలుగు సినిమాల్లో నటించడమే కాదు, మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన మలయాళ సినిమాలెన్నో తెలుగులోకి డబ్ అయి విజయం సాధించాయి. అందుకే ఈ సూపర్ స్టార్స్ ఇద్దరికి తెలుగులో చాలా మంది అభిమానులున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే మోహన్ లాల్, మమ్ముట్టికి యునైటెడ్ అరబ్ ఎమిరేస్ట్ అరుదైన గారవాన్ని ఇచ్చింది. దుబాయ్ ప్రభుత్వం ఈ స్టార్ హీరోలిద్దరికీ ఒకేసారి గోల్డెన్ వీసాలు జారీ చేసింది. మమ్ముట్టి, మోహన్ లాల్ కు ఇది మొదటి గోల్డెన్ వీసా కావడం విశేషం. అబుధాబి ఆర్ధిక అభివృద్ధి విభాగం ఛైర్మన్ మహ్మద్ అలీ అల్ షోర్ఫా అల్ హమ్మది ఈ సూపర్ స్టార్స్ ఇద్దరికీ గోల్డెన్ వీసాలు అందజేశారు.
మళయాళి సినిమా పరిశ్రమకు మమ్ముట్టి, మోహన్‌లాల్ చేసిన కృషిని ఈ సందర్బంగా మహ్మద్ అలీ అల్ షోర్ఫా అల్ హమ్మది కొనియాడారు. 10 ఏళ్ల కాలపరిమితితో వారికి గోల్డెన్ వీసాలు మంజూరు చేసినట్లు మహ్మద్ అలీ తెలిపారు. ఇక ఇలా దబాయ్ గోల్డెన్ వీసాలు లభించడం మలయాళ సినిమాకు దక్కిన అరుదైన గౌరవం అని మోహన్‌లాల్ అన్నారు. దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేయడం పట్ల మమ్ముట్టి సంతోషం వ్యక్తం చేశారు.
ఇక మోహన్‌లాల్, మమ్ముట్టి కంటే ముందు భారతీయ సినీ పరిశ్రమ నుంచి షారుఖ్ ఖాన్, సంజయ్ దత్ లు దుబాయ్ గోల్డెన్ వీసాలు అందుకున్నారు. పలు రంగాల్లో దేశ అభివృద్ధికి కృషి చేసిన విదేశీయులకు దుబాయ్ 2019 నుంచి గోల్డెన్ వీసాలును ఇస్తోంది. ఇది కేవలం పదేళ్ల విసా మాత్రమే కాదు, దుబాయ్ ప్రభుత్వం ఇచ్చే గౌరవంగా భావిస్తుంటారు సెలబ్రెటీలు.