ప్రస్తుతం వానాకాలం సీజన్. ఎటు చూసిన వర్షాలే వర్షాలు. అయితే అటు సౌదీ అరేబియాలో ప్రస్తుతం వేసవి కాలం. ఎండలకు జనం అల్లాడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో జనం వేడి భరించలేకపోతున్నారు. దుబాయ్‌లో ప్రతి రోజూ 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ క్రమంలో దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల సాయంతో కృత్రిమంగా వర్షాలు కురిపించింది. అతి తక్కువ వర్షపాతంను అధిగమించడం కోసం క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ ఉపయోగించి కృత్రిమ వర్షాలు పడేలా చేస్తున్నారు.
అమృతం కోసం దేవతలు క్షీరసాగర మథనం చేశారు. వర్షం కోసం యూఏఈ ప్రభుత్వం మేఘ మథనం చేస్తున్నది. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కోసం మేఘాలను కరిగిస్తున్నది. అనేక దేశాలు ఈ పద్దతి ఉపయోగించి ఇప్పటికే కృత్రిమ వర్షాలు నమోదుచేస్తున్నాయి.ఈ ప్రక్రియను చేయడానికి సాధారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను క్యారియర్లుగా ఉపయోగిస్తారు.
ఈ టెక్నాలజీ సాయంతో మేఘాలను విద్యుదావేశానికి గురిచేస్తారు. దాంతో మేఘాలు కరిగి, అధిక వర్షపాతాన్నిస్తాయి. ఈ డ్రోన్ క్లౌడింగ్ సీడింగ్ ప్రక్రియతో దుబాయ్ నగరంలో కృత్రిమ వర్షాలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను అధికారులు ట్విట్టర్ లో పంచుకున్నారు.
మేఘమథనం అంటే ఏదో తుంపర్ల లాంటి వాన కాదు. మన దగ్గర నైరుతి రుతుపవనాలు వచ్చినప్పుడు ఎట్లాంటి వాన పడుతుందో అక్కడా అలాగే పడుతున్నది. ఎడారి ఇసుకలో సైతం వరద పారుతున్నది. రోడ్డు పక్క నుంచి జాలువారే నీళ్లు జలపాతాన్ని తలపిస్తున్నాయి.
రికార్డు స్థాయి ఎండలకు గల్ఫ్ దేశాలు పెట్టింది పేరు. దుబాయ్ లో సాలీనా సగటున కేవలం 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. డ్రోన్ల సాయంతో మేఘాలకు షాకిచ్చి వాన కురిపించారు. ఎన్నాళ్ల నుంచో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిపిస్తున్న యూఏఈ ఈసారి డ్రోన్ల సాయంతో చేసింది.
యూఏఈ డ్యాములు, ఎడారి లోయలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నది. దేశంలో ప్రస్తుతం 130 డ్యాములు ఉన్నాయి. వీటిల్లో 42 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. మరిన్ని డ్యాములు నిర్మించాలని యూఏఈ ప్రభుత్వం యోచిస్తున్నది.
Dubai creates its own rain to battle 50C heat using ‘zapper drones’ that cause showers pic.twitter.com/9PxGDr5S2X
— The Sun (@TheSun) July 23, 2021