మనిషి సాంకేతిక విజ్ఞానాన్ని మంచి పనులకి వినియోగిస్తే అది ఎందరికో ప్రయోజనం కలిగిస్తుంది.అదే చెడు కార్యకలాపాలకి వాడితే సమాజానికి ముప్పు వాటిల్లుతుంది.ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం లేకపోలేదు .అందుకే ప్రభుత్వ కార్యకలాపాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు.రాబోయే పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా ఎన్నో చర్యలు చేపడతారు.ప్రస్తుతం డ్రోన్ల వాడకం పరిశీలించినట్లయితే సినిమా షూటింగుల్లోను,వివాహాది కార్యక్రమాల్లోనూ ,ఎన్నో రకాల ఈవెంట్స్ లోను విరివిగా వాడుతున్నారు.
అయితే దేశ రక్షణ వ్యవస్థ కూడా శత్రువుల రహస్యాలను పసిగట్టడం కోసం ప్రత్యేక డ్రోన్లను వినియోగిస్తున్నారు.రాజధాని లో ఆగష్టు 15వతేదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో డ్రోన్లను,అదేవిధంగా గాలిలో తిరిగే ఇతర ఉపకరణాలను కొన్ని ముఖ్య ప్రదేశాలలో వాడకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.అది అమలు పరిచే పనిలో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డ్రోన్లు తిరిగేందుకు ప్రత్యెక నడవా (కారిడార్)ను ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి గాను డ్రోన్ నియమాలు 2021పేరిట కొత్త ముసాయిదాన్ని రూపకల్పన చేసారు.
ఇది అమలైతే కనుక మానవ రహిత ఎయిర్ క్రాఫ్ట్ సిస్టం (యు ఏఎస్ ) నిబంధనలు రద్దవుతాయి.దీని ద్వారా కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా డ్రోన్లు నూతన సాంకేతికతను ఒక సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించాయి ,ఖర్చులు తగ్గిస్తున్నాయి.సమయాన్ని ఆదా చేస్తున్నాయి.ఈ సాంకేతికతను మనం సద్వినియోగం చేసుకోవటం మన కర్తవ్యం.
ప్రధానంగా అంకుర సంస్థలకి ఇది ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని ట్వీట్ చేసారు .అలాగే ఈ ముసాయిదా నిబంధలపై ప్రజలు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను ఆగష్టు 5లోపులో తెలియ పరచాలని పౌర విమాన శాఖ కోరింది. దిల్లీ లో డ్రోన్లపై జూలై 16 నుండి ఆగష్టు 16 వరకు పంద్రాగష్టు వేడుకలను దృష్టిలో పెట్టుకుని డ్రోన్లే కాకుండా పారాచూట్లు ,హాట్ ఎయిర్ బెలూన్లు వంటి ఎగిరే వస్తువుల్ని దిల్లీ పోలీస్ కమిషనర్ బాలాజీ శ్రీ వాస్తవ నిషేధాన్నివిధించారు.
జమ్ములో కట్టుదిట్టమైన భద్రత ఉన్న వాయు సేన స్థావరాలకు సమీపంలో ఇటీవల కొన్ని డ్రోన్లు సంచరించిన కారణంగా పోలీసు వర్గాలకు అందిన సమాచారం ప్రకారం పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా ఆంక్షలు విధించారు. డ్రోన్ల వాడకంపై ముఖ్య కీలకాంశాలను పరిశీలిద్దాం. విశ్వసనీయత ,స్వీయ ద్రువీకరణ ఆధారంగా కొత్త ముసాయిదా నిబంధనలను రూపకల్పన చేసారు.
ఆన్ లైన్ లో సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తారు .ఇందులో మానవ ప్రమేయాన్ని చాలా తగ్గించారు.గత నిబంధనల ప్రకారం 25 ధ్రువ పత్రాలను భర్తీ చేయాలి ,దీనిని 6కు తగ్గించారు.ఫీజుల ధరలను భారీగా తగ్గించారు .డ్రోన్ పరిమాణం తో సంబంధం లేకుండా వీటిని వసూలు చేయనున్నారు.
వ్యాపార సంబంధాలకోసం వాడే మైక్రో డ్రోన్లకు,పరిశోధన ,అభివృద్ధి సంస్థలు వాడే నానో డ్రోన్లకు పైలట్ లైసెన్స్ అవసరం లేదు.గ్రీన్ జోన్లలో 400 అడుగులు ,విమానాశ్రయాలకు 8 నుంచి 12 కిలోమీటర్ల మధ్యలో 200 అడుగుల ఎత్తు వరకు సంచారం చేయటం కోసం ఎలాంటి అనుమతులు అక్కర్లేదని పేర్కొన్నారు.అలాగే డ్రోన్ల బదిలీ ,రిజిస్ట్రేషన్ రద్దు చేసే ప్రక్రియ కూడా మరింత సులభం కానుంది.
సరుకుల రవాణా కోసం డ్రోన్ల నడవాలను మరింత పురోగతి కోసం డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్ ని ఏర్పాటు చేస్తారు.భారత్ లో నమోదు చేసుకున్న విదేశీ సంస్థలు కూడా డ్రోన్లతో ఎన్నో విధులను నిర్వహించేందుకు అవకాశం ఉంది.డ్రోన్ల వాడకంలో భారత దేశం మరింత పురోగతి సాధించి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చాలని ఆశిద్దాం !