దేశ వ్యాప్తంగా గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది.. ఆనందంలో, విషాదంలోనూ భరించలేని నొప్పితో.. తేరుకోలేని విధంగా ఇబ్బందికి గురి చేస్తూ ఒక్కసారిగా గుండె ఆగిపోతుంది. తనను గుండె మెలిపెడుతున్న..ప్రయాణీకులను సురక్షితంగా చేర్చాలని భావించాడు ఓ ఆర్టీసీ డ్రైవర్..
గుండె రోజు రోజుకూ బలహీన పడుతోంది. చిట్టి గుండె మెలిపెడుతూ ప్రాణాలను హరిస్తోంది. ఏమౌతుందో తెలిసేలోగా మనిషిని బలితీసుకుంటుంది. ముందస్తు హెచ్చరికలు ఏమీ లేకుండానే మనిషిని పట్టి పిండేస్తుంది. నిద్రలో, పనిలో, ప్రయాణాల్లో, ఆనందంలో, విషాదంలోనూ భరించలేని నొప్పితో.. తేరుకోలేని విధంగా ఇబ్బందికి గురి చేస్తూ ఒక్కసారిగా గుండె ఆగిపోతుంది. దేశ వ్యాప్తంగా గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఛాతీలో నొప్పిగా ఉన్న అనేక మంది ప్రాణాలు తన చేతిలో ఉన్నాయని భావించిన ఓ ఆర్టీసీ డ్రైవర్.. ప్రయాణీకులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది.
ఈ విషాద ఘటన రాధన్‌పూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. బస్ కండక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాధన్‌పూర్‌కు చెందిన భర్మల్ అహిర్ (40) గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (జిఎస్‌ఆర్‌టిసి)లో బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో భాగంగా బస్సు నడుపుతున్న సమయంలో ఛాతీలో నొప్పి వచ్చింది. ఛాతీ నొప్పిని భరిస్తూనే అహిర్ మరో 15 కి.మీ బస్సు నడిపి డిపోకు చేర్చాడు. అనంతరం గుండెపోటుతో కుప్పకూలాడు. హుటాహుటిన అతడిని రాధన్‌పూర్ సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు దృవీకరించారు.
మృతుడు అహిర్ ఆదివారం రాత్రి 8:30 గంటలకు బస్ డ్రైవింగ్ చేస్తూ సోమనాథ్‌కు ప్రయాణీకులను తీసుకువచ్చారు. సోమవారం ఉదయం తిరిగి రాధన్‌పూర్‌కు బయలు దేరారు. 7:05 గంటలకు రాధన్‌పూర్ చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రయాణీకులు ఉదయం టీ బ్రేక్ కోసం వారాహి వద్ద కొద్దిసేపు బస్సు ఆపారు. ఆ సమయంలో అహిర్ తనకు ఛాతీ నొప్పిగా ఉన్నట్లు చెప్పాడని కండక్టర్ తెలిపాడు. ప్రయాణీకులను హైవేపై ఒంటరిగా వదిలేయడానికి మనస్పొప్పకపోవడంతో.. గుండె నొప్పి వేధిస్తోన్నా పట్టించుకోకుండా బస్సు నడుపుకుంటూ రాధన్‌పూర్ డిపోకి వాహనాన్ని చేర్చారు. అందుకే బాధను భరిస్తూనే మరో 20 నిమిషాల పాటు నడిపి డిపోకు బస్సు చేర్చి మరణించాడని కండక్టర్ కన్నీటి పర్యాంతమయ్యాడు.