చెన్నై (నేషనల్ డెస్క్)- తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘన విజయం సాధించింది. రాజకీయ ఉద్దండులు కరుణానిధి, జయలలిత లేకుండా తమిళనాడులో ఈ సారి ఎన్నికలు జరిగాయి. సుమారు పదేళ్ల పాటు అధికారానికి దూరమైన డీఎంకే.. ఈసారి ఎట్టకేలకు విజయతీరాలను తాకింది. అటు అధికార అన్నాడీఎంకే గట్టిపోటీయే ఇచ్చినా, డీఎంకే స్పష్టమైన మెజార్టీ వచ్చింది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకుగానూ డీఎంకే కూటమి 157 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కొళ్లత్తూరు నుంచి పోటీచేసిన డీఎంకే అధినేత స్టాలిన్ 68 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. చెపాక్ నుంచి బరిలో దిగిన ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ 40 వేల పైచిలుక మెజార్టీతో గెలిచారు. ఇక మొట్టమెదటి సారి ఎన్నికల బరిలో నిలిచిన నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీధి మయ్యమ్ అడ్రస్ లేకుండా పోయింది.
కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన కమల్ ఓడిపోయారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేకు దగ్గరైన బీజేపీ, ఈ ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీచేసింది. చెన్నైలోని మొత్తం 16 స్థానాలకుగానూ 13 చోట్ల డీఎంకే అభ్యర్థులే విజయం సాధించారు. ప్రముఖుల్లో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఎడప్పాడి విజయం సాధించగా, బోడినాయక్కనూరు నుంచి డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం గెలుపొందారు. ఇక కొవెలపట్టి స్థానంలో పోటీచేసిన శశికళ మేనళ్లుడు, ఏఎంఎంకే నేత టీటీడీ దినకరణ్ ఓడిపోయారు. డీఎంకేతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ గత ఎన్నికల కంటే మంచి ఫలితాలనే సాధించింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం 25 సీట్లలో పోటీచేయగా 17 స్థానాల్లో గెలుపొందింది.