విజయవాడ- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిని ఒకరు తిట్టుకోవడం పరిపాటే. కానీ ఈ మధ్య కాలంలో ఈ తిట్ల దండకం మరీ శృతి మించిపోతోంది. జనం చీత్కరించే భాషను వాడుతున్నారు పొలిటికల్ లీడర్స్. హీనమైన భాషలో ప్రజా ప్రతినిధులమనే ఇంగితం విడిచేసి అధ్వాన్నంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఒరేయ్ తురేయ్ అని నారా లోకేష్ సంబోదిస్తే , శాసన మండలిలోనే కుక్కని కొట్టినట్టు కొడతాం అని డైరెక్ట్ ఎటాక్ చేశారు మంత్రి కొడాలి నాని. దీంతో వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య మాటల యుధ్దం మళ్లీ మొదలైంది.
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ తిట్ల దండకం అందుకుంది ఒకప్పటి హీరోయిన్, సినీ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదని నానిని హెచ్చరించింది. చంద్రబాబు లాంటి స్థాయి ఉన్న వ్యక్తి, మీ తండ్రి వయసు ఉన్న నాయకుడ్ని మీరు గాడిద అని మాట్లాడటం సరికాదని హితువు పలికింది. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే మంచిదని వ్యాఖ్యానించింది దివ్యవాణి.
టీడీపీ అధినేత చంద్రబాబు నడకలోను రాజసం ఉందన్న ఆమె, ఒక రౌడీలా షర్ట్ బటన్స్ వదిలేసి రొమ్ము విరుచుకుని నేనే రౌడీని అని కెమెరాల ముందుకు రాలేదని మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి కామెంట్ చేసింది. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి మీది కాదు అని తెలుసుకోండని అంది. ఇకపై చంద్రబాబుపై అనవసర కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించింది దివ్వవాణి. మరి దివ్యవాణి కౌంటర్ కు మళ్లీ మంత్రి కొడాలి నాని ఎలా రియాక్ట్ అవుతారన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయాల్లో సహజమే అయినా, ఇలా బూతులు తిట్టుకోవడంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.