తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో ఎన్నికల వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 14న జరగనున్న తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో రిటర్నింగ్ అధికారి కె.వి.ఆర్ చౌదరి సీనియర్ జర్నలిస్టు, దర్శకుడు ప్రభు, మద్దినేని రమేశ్ నామినేషన్స్ను తిరస్కరించడం వివాదానికి కారణం అయ్యింది.
ప్రభు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నకారణంగా చలనచిత్ర దర్శకుల సంఘంలో పోటీ చేయడానికి వీలులేదు అంటూ ఆయన నామినేషన్ ను తిరస్కరించారు. అయితే.. ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించిన జర్నలిస్టు ప్రభుకి న్యాయం జరిగింది. ఉన్నత న్యాయస్థానం లో ఆయన వేసిన రిట్ పిటిషన్ ని విచారించిన ఉన్నత న్యాయస్థానం.. ప్రభు అభ్యర్థిత్వాన్ని తిరస్కరించరాదని, ఆయన నామినేషన్ ను అనుమతించింది.
ఈ సందర్భంగా జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. “న్యాయస్థానం ఈ రోజున ఇచ్చిన తీర్పు చాలా చారిత్రాత్మకమైనది. ఇది దర్శకుల సంఘంలో కొందరు వ్యక్తులు చేస్తున్న అప్రజాస్వామిక వ్యవహారాలకు చెంపపెట్టు. నాకు ప్రచార వ్యవధి లేకుండా చేయటం తప్ప, ఈ తప్పుడు నిర్ణయం వల్ల ఆ వ్యక్తులు సాధించింది ఏమీ లేదు. ఈ కొద్ది వ్యవధిలోనే తీవ్ర స్థాయిలో ప్రచారం చేసి అభ్యర్థుల సభ్యుల అభిమానంతో అత్యధిక మెజార్టీతో గెలవగలనన్న నమ్మకం నాకుంది” అన్నారు జర్నలిస్ట్ ప్రభు. అలాగే కోర్టును ఆశ్రయించిన మరో అభ్యర్థి, సీనియర్ దర్శకుడు మద్దినేని రమేష్ కు కూడా అనుకూలంగా కోర్టు తీర్పు రావటం విశేషం. అయితే.. కేవలం నామినేషన్స్ విషయంలోనే ఇంత పక్షపాతంగా వ్యవహారించిన అధికారుల పర్యవేక్షణలోఎన్నికల నిర్వహణ ఎంత న్యాయంగా జరుగుతుందన్న అనుమానాలు దర్శకుల సంఘంలో వ్యక్తమవుతున్నాయి. కాగా.. హై కోర్టులో జనలిస్ట్ ప్రభు తరుఫున యువ న్యాయవాది, గీత రచయిత జక్కుల లక్ష్మణ్ ఈ కేసులో తమ వాదనలు కోర్టుకు వినిపించడం విశేషం.