న్యూ ఢిల్లీ- కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు పర్యావరణ కాలుష్యంపై దృష్టి సారించాయి. ఈమేరకు ప్రదాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల స్క్రాపేజ్ పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పాలసీలను అనుసరిస్తున్నాయి. అందువల్ల ఇప్పటికీ పాతబడిన వాహనాలు వాడే వారు ఇక అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇకపై పాత వాహనాలతో రోడ్డుపైకి వెళ్తే జరిమానాలు కట్టాల్సిందే. అంతే కాదు ఆ వాహనాలను సీజ్ చేస్తారు కూడ.
ఇందులో భాగంగానే దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం పాత వాహనాల విషయంలో కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. 15 ఏళ్ల దాటినపెట్రోల్ వాహనాలు, 10 ఏళ్ల దాటిన డీజిల్ వాహనాలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ వాహనాలను రోడ్లపై నడిపితే 10 వేల రూపాయల జరిమానా విధిస్తోంది. ఇకపై ఎవరైనా పాత వాహనాలను నడిపితే జరిమానా కట్టాల్సిందేనని హెచ్చరించింది కెజ్రీవాల్ సర్కార్.
ఇక ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కు ఢిల్లీ ప్రభుత్వం పలు అధికారాలను కట్టబెట్టింది. ఎవరైనా రోడ్డుపై పాత వాహనాలను నడిపితే, ఆ వాహనాలను స్క్రాపేజ్ సెంటర్‌కు పంపే అధికారం ఢిల్లీ రవాణా శాఖకు ఉంటుందని స్పష్టం చేసింది. ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం నేపధ్యంలో, పొల్యూషన్ నియంత్రణలో భాగంగా కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ కొత్త నిబంధనను అమలులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం స్క్రాపేజ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం లాగే ఇతర రాష్ట్రాలు సైతం ఇలాంటి నిబంధనలు పెట్టేందుకు సమాయుత్తం అవుతున్నాయని తెలుస్తోంది.