హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత, సకాలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన ప్రజలు, స్మశానవాటికలను తలపించిన ప్రభుత్వ హాస్పిటల్స్, లక్షలకి లక్షలు గుంజేసిన ప్రైవేట్ హాస్పిటల్స్, రెమ్డెసివిర్ బ్లాక్ దందా.. ఇవన్నీ మన దేశంలో నిన్న మొన్నటి వరకు కనిపించిన పరిస్థితిలు. కానీ.., కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో వణికిపోయిన భారతదేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రోజువారీ కేసులు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నీ రాష్ట్రాలలో సాధారణ పరిస్థితిలు నెలకొంటున్నాయి. ఇప్పుడు అన్నీ హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత కనిపించడం లేదు. ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా అత్యవసర పరిస్థితిలు కనిపించడం లేదు. దేశంలో సెకండ్ వేవ్ ఉధృతి మే 15 నాటికి అత్యధిక స్థాయికి చేరి, తరువాత మామూలు పరిస్థితి వస్తుందని ఇది వరకే నిపుణులు తెలియచేశారు. వారు చెప్పినట్టే మే మూడో వారం నుంచి కేసుల ఉధృతి తగ్గిందనే చెప్పాలి. ఒకానొక సమయంలో దేశంలో రోజుకి 3 లక్షల పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. కానీ.., ఇపుడు ఆ సంఖ్య లక్షకే పరిమితం అయ్యింది.
అన్నీ రాష్ట్రాలలో లాక్ డౌన్, కర్ఫ్యూ అమలు అవుతుతుండటంతో ఈ సంఖ్య ఇంకా తగ్గే అవకాశం కనిపిస్తోంది. కరోనా కారణంగా వణికిపోయిన మహారాష్ట్ర, ఢిల్లీ, బిహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో కూడా బెడ్ ఆక్యుపెన్సీ, ఆక్సిజన్ అవసరం తగ్గుతూ వస్తోంది. ఒక దశలో రోజుకి 60 వేలకు పైగా కేసులు నమోదైన మహారాష్ట్రలో ఇప్పుడు రోజువారీ కేసుల సంఖ్య 25 వేల లోపే ఉండటం విశేషం. తెలుగు రాష్ట్రాలలోనూ ఈ తగ్గుదల కనిపిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో కూడా ఐసీయూ, వెంటిలేటర్ పడకలు కాస్త సులువుగానే దొరుకుతున్నాయి. ఈ లెక్కలు అన్నింటినీ బట్టి రాబోతుంది మంచి కాలమే అని వైద్య నిపుణులు చెప్తున్నారు. కానీ.., నాయకులు, ప్రజలు ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఉదృతి తగ్గినంత మాత్రం కరోనా మహమ్మారి పూర్తిగా పోయినట్టు కాదు. మరో దశ తప్పక వస్తుంది. కనీసరం ఈసారికైనా మన దేశం అన్నీ వైద్య వసతులతో మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధం అవుతుందేమో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.