ప్రముఖ తెలుగు చిత్ర దర్శకుడు దాసరి నారాయణ రావు జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. చిత్రపురి కాలనీలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆది శేషగిరిరావు అతిధిగా హాజరుకానున్నారు.
శతాధిక చిత్రాల దర్శకుడు దాసరి నారాయణ రావు జయంతి వేడుకలు మే 4వ తేదీన ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీలో దాసరి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ప్రముఖ నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా దాసరి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. చిత్రపురి కాలనీ హోసింగ్ సొసైటీ చైర్మన్ అనిల్ కుమార్ వల్లభనేని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇక, ఈ కార్యక్రమంలో దాసరి శిష్య బృందం, సీనియర్ జర్నలిస్ట్ ప్రభుతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటారు. కాగా, దాసరి నారాయణ రావు దర్శకుడిగా తెలుగుతో పాటు పలు భాషల్లో హిట్టు సినిమాలను తెరకెక్కించారు. దర్శకుడిగా వందకు పైగా సినిమాలు చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పారు.