రోడ్డు ప్రమాదాలు.. ఒక రోజులో దేశవ్యాప్తంగా వందల కొద్దీ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. వీటిలో చాలా కొద్ది సంఘటనలు మాత్రమే ప్రమాదాలు. చాలా వరకు నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవించడం వల్ల జరుగుతున్నవే ఉన్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు, జరిమానాలు కూడా వేస్తూనే ఉన్నారు. కానీ, చాలామందిలో మార్పు రావడం లేదు. యధేచ్చగా, ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ ప్రాణాలు, వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఇటీవల బాలానగర్ లో జరిగిన ఓ యాక్సిండెంట్ గురించి ట్రాఫిక్ పోలీసులు వీడియో విడుదల చేశారు. బాలానగర్ లో జంక్షన్ వద్ద రాత్రి సమయంలో ఓ కారు వేగంగా వెళ్లి డివైడర్ కు ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాదానికి కారణం అతివేగం అని దృశ్యాలు చూస్తే తెలిసిపోతుంది. అయితే డ్రైవింగ్ చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పూటుగా తాగి ఉన్నట్లు తెలిపారు. ఆ ప్రమాదంలో వెనుక సీటులో కూర్చొన్న డ్రైవర్ మిత్రుడు ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. అందుకు సంబంధించిన దృశ్యాలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు.
ఈ ప్రమాదానికి సంబంధించి ఐపీఎస్ అధికారి టీ.శ్రీనివాసరావు స్పందించారు. “రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణం అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడమే. ఇటీవల బాలానగర్ లో జరిగిన ప్రమాదం అలాంటిదే. ఆ ప్రమాదంలో డ్రైవింగ్ చేసిన వ్యక్తి మిత్రుడు ప్రాణాలు కోల్పోయాడు. సైబరాబాద్ పరిధిలో జరిగే ప్రమాదాల్లో 30 శాతం ప్రమాదాలు మద్యం సేవించి వాహనం నడపడం వల్లే జరుగుతున్నాయి” అంటూ ఐపీఎస్ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అతి వేగంగా కారు వెళ్లి డివైడర్ ఢీకొట్టడం చూసి అంతా షాకవుతున్నారు. సినిమాలో చెప్పినట్లు రోడ్డు యాక్సిండెంట్ లో ఒక ప్రాణం పోవడం అంటే ఒక కుటుంబం రోడ్డున పడటం. అందుకే వాహనాలు నడిపే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.