బెంగళూరు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెపొటుతో హఠాన్మరణం పొందిన పునీత్ రాజ్ కుమార్ బాలనటుడిగా చిన్నప్పుడే తన ప్రతిభను నిరూపించుకున్నారు. సినీ రంగంలో బాల నటుడుగా జాతీయ అవార్డు అందుకున్నారంటే పునీత్ టాలెంట్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఆ తరువాత పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన 32 సినిమాల్లో దాదాపు అన్నీ హిట్టయ్యాయి.
పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల ప్రాంతాలు, బాషలతో సంబంధం లేకుండా అంతా ఆవేధన చెందుతున్నారు. ఒక వ్యక్తి సమాజానికి ఎంతో కొంత చేయకపోతే ఆయన మరణం సమాజాన్ని ఇంతలా కదిలించదు. ఇప్పుడు పునీత్ లేరన్న నిజాన్ని సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద కనీసం 100 కోట్ల వ్యాపారం జరగుతుంది. ఇండస్ట్రీలో అంతలా తన మార్కును చూపించారు పునీత్.
ఇటువంటి సమయంలో పునీత్ రాజ్ కుమార్ హఠాత్తుగా మరణించడం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపనుందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో పునీత్ నటించిన సినిమాలన్నీ కనీసం 40 నుంచి 50 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినవే. ప్రస్తుతం పనీత్ రాజ్ కుమార్ జేమ్స్, ద్విత్త అనే రెండు కన్నడ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల బడ్జెట్ కలిపి 120 కోట్ల రూపాయలు. ఇప్పుడు పునీత్ మరణంతో ఈ రెండు సినిమాల భవిత్వం ప్రశ్నార్దకంగా మారింది.
అంతేకాదు పునీత్ రాజ్ కుమార్ తన స్వంత బ్యానర్ లో ఏకంగా 5 సినిమాలు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ఈ ఐదు సినిమాల బడ్జెట్ 200 కోట్ల రూపాయలని ఇండస్రీ వర్గాలు చెబుతున్నాయి. పునీత్ లైన్ లో పెట్టిన సినిమా ప్రాజెక్ట్‌ల విలువ దాదాపు 400 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం ఈ సినిమా ప్రాజెక్టులన్నింటిని ప్రశ్నార్ధకంలోకి నెట్టేశాయి.