ఇంటి పేరు నిలబెడతాడని మగపిల్లలు పుట్టాలని భావిస్తుంటారు తల్లిదండ్రులు. తమ కష్టాలు బిడ్డలు పడకూడదని తమ కడుపు మాడ్చుకుని పిల్లలను చదివించి, పెద్ద చేసి.. వారి కోసం ఆస్తులు కూడబెట్టి..పెళ్లిళ్లు చేస్తారు. తల్లిదండ్రులు మలిదశకు చేరుకునే సరికి.. వారిని వంతుల వారీగా పంచుకోవడం లేదంటే నడిరోడ్డుపై వదిలిపెడుతున్నారు. తాజాగా ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం చూస్తే..
‘తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు, పుట్టనేమి ! వాడు గిట్టనేమి ! పుట్టలోన చెదలు పుట్టదా ? గిట్టదా’అంటూ వేమన రాసిన పద్యం నేటి సమాజ తీరుకు సరిగ్గా సరిపోతుంది. పున్నామ నరకం నుండి తప్పిస్తాడని, తమ వంశ వృద్ధికి తోడ్పడతాడని, తమ ఇంటి పేరు నిలబెడతాడని మగపిల్లలు పుట్టాలని భావిస్తుంటారు తల్లిదండ్రులు. తమ కష్టాలు బిడ్డలు పడకూడదని తమ కడుపు మాడ్చుకుని పిల్లలను చదివించి, పెద్ద చేసి.. వారి కోసం ఆస్తులు కూడబెట్టి..పెళ్లిళ్లు చేస్తారు. తల్లిదండ్రులు రెక్కలు అరిగి.. వృద్దాప్యానికి వచ్చే సరికి.. ఆస్తులు రాయించుకుని..వారిని చూసే బాధ్యత వచ్చేసరికి వాటాలు వేసుకోవడం లేదంటే.. అనాధశ్రమాల్లో వదిలిపెడుతున్నారు. అలా తన బాగోగులు నలుగురు కుమారులు వంతుల వేసుకోవడం నచ్చని తండ్రి తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నాడు.
తన పోషణ విషయంలో కుమారులు కనబరిచిన తీరుతో మనస్థాపం చెందిన ఓ తొంభై ఏళ్ల వృద్ధుడు ఆత్మాహుతి చేసుకున్న ఘటన తెలంగాణాలోని సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హుస్నాబాద్ మండలం పొట్లపల్లికి చెందిన మెడబోయిన వెంకటయ్య(90)కు నలుగురు కుమారులు. ఓ కుమార్తె ఉన్నారు. భార్య గతంలోనే కాలం చేసింది. నలుగురు కుమారులు కనకయ్య, ఉమ్మయ్య, పోచయ్య, ఆరయ్యలకు నాలుగు ఎకరాల భూమిని పంచేశాడు వెంకటయ్య. కుమారుల్లో ఇద్దరు పొట్లపల్లిలో, ఒకరు హుస్నాబాద్‌లో, మరొకరు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో నివసిస్తున్నారు. ఆయనకు వృద్ధాప్య పింఛను వస్తుంది. గ్రామంలోనే ఉంటున్న పెద్ద కుమారుడు కనకయ్య దగ్గర ఉంటున్నాడు. అయితే అతడి పోషణ విషయంలో అన్నాదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం పంచాయతీకి వెళ్లింది.
నెలకు ఒకరు చొప్పున నలుగురు కుమారులు వంతులవారీగా పోషించాలని ఐదు నెలల క్రితం గ్రామ పెద్దలు నిర్ణయించారు. అయితే పెద్ద కుమారుడి వద్ద గడువు పూర్తి అయినా మరో కుమారుడి వద్దకు వెళ్లలేదు. సొంత ఊరిని, ఇంటిని వదిలి.. అక్కడికి తాను వెళ్లనని చెప్పేవారు. అయినప్పటికీ గ్రామ పంచాయతీ తీర్పుకు కట్టుబడి మరో కుమారుడు వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరిన ఆయన గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు. అక్కడ తన బాధను పంచుకున్నారు. బుధవారం ఉదయం నవాబుపేటలోని తన మరో కుమారుడి ఇంటికి వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే సాయంత్రం వరకు ఏ కుమారుడి ఇంటికీ వెళ్లలేదు. గురువారం మధ్యాహ్నం పొట్లపల్లి గ్రామంలో ఎల్లమ్మగుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో ఓ పెద్దాయన మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం వెంకటయ్యదేనని కుమారులు, కుటుంబ సభ్యులు గుర్తించారు. కుమారులు తనను పంచుకోవడాన్ని చూసి మనస్థాపానికి గురైన తండ్రి.. వారి మీద ఆధారపడకూడదని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తనకు తాను చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలంలో తాటికమ్మలను ఒకచోట కుప్పగా వేసి వాటికి నిప్పంటించి, అందులో దూకి ఆత్మాహుతికి పాల్పడినట్లు భావిస్తున్నామని ఏఎస్‌ఐ మణెమ్మ తెలిపారు. ఈ హృదయ విదాకర ఘటన గురించి వింటుంటే.. ఏ తండ్రికి ఇటువంటి కష్టం రాకూడదని అనిపిస్తోంది.