ఇళ్లు, ఒళ్లు మరిచిపోయి మద్యానికి బానిసలై వీధిన పడుతున్న జీవితాలెన్నో. బాధ్యతలను, బంధాలను పట్టించుకోకుండా మద్యం తాగడమే జీవితంగా బ్రతికేస్తుంటారు మందు బాబులు. దీంతో ఇళ్లు గడవడం కష్టంగా మారుతుంది. దీన్ని ప్రశ్నిస్తే నిత్యం గొడవలు, తగాదాలే. దీని కారణంగా అనేక ప్రాణాలు కూడా పోయిన ఘటనలున్నాయి.. తాజాగా ఏపీలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది.
మద్యం అనేక మంది జీవితాల్లో చిచ్చును రాజేస్తోంది. ఇంటి బాధ్యతలు చూడాల్సిన పురుషుడు మద్యానికి బానిసై కుటుంబాన్నిరోడ్డు పాలు చేస్తున్నాడు. డబ్బులు ఉండాలే కానీ ఇళ్లు, ఒళ్లు మరచి లేచిందీ మొదలు రాత్రి పొద్దు పోయేదాకా తాగి.. ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులపై విరుచుకుపడుతన్నాడు. తాగిన మత్తులో తల్లిదండ్రులు, తో బుట్టువులు, భార్య, బిడ్డలు అని కూడా చూడటం లేదు.. వారితో గొడవలకు దిగడం.. ఆ ఉద్రేకంలో ప్రాణాలు తీయడం లేదా కోల్పోవడం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అటువంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్యను కడతేర్చాడు కసాయి భర్త.
వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు, కల్యాణి భార్యా భర్తలు. అయితే భర్త కోటేశ్వరరావు మద్యానికి బానిసై.. రోజు భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఇదే క్రమంలో బుధవారం ఫూటుగా మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. భార్యను అన్నం పెట్టమని అడగ్గా.. ఆమె నిరాకరిండంతో.. తన మాట వినలేదన్న అక్కసు, కోపంతో భార్యను గొడ్డలితో అతి కిరాతకంగా నరికాడు. భార్యను హత్య చేసిన అనంతరం ఘటనా స్థలం నుండి పారిపోయిన నిందితుడు.. సమీపంలోని మామిడి తోటలోకి ఓ చెట్టుపైన దాక్కొన్నాడు. తెల్లారితే శ్రీరామ నవమి అనగా.. ఈ ఘటన జరగ్గా.. పండగ పూట ఆ గ్రామంలో విషాదం నెలకొన్నట్లయింది.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గ్రామానికి సమీపంలో ఉన్న మామిడి తోటలో ఓ చెట్టెక్కి నిందితుడు కోటేశ్వరరావు కూర్చొన్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. అయితే అక్కడకు వెళ్లాక దిగేందుకు నిరాకరించాడు కోటేశ్వరరావు. దీంతో తమ స్టైల్లో పోలీసులు రంగంలోకి దిగి, అతడిని చెట్టునించి దింపి అదుపులోకి తీసుకున్నారు. మద్యానికి బానిస అవ్వడమే కాకుండా.. ప్రశ్నిస్తున్న భార్య, ఇతర కుటుంబ సభ్యుల ప్రాణాలు తీస్తున్న ఈ వైఖరిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.