భార్యా, భర్తల బంధంలో గొడవల్లో మూడవ వ్యక్తుల చొరవ అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నట్లు అవుతోంది. భర్తతో పాటు అత్తింటి వాళ్ల జోక్యంతో మానసికంగా క్రుంగిపోతున్నారు మహిళలు. ఆడపడుచు, భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ తీవ్ర నిర్ణయం తీసుకుంది.
భార్యా, భర్తల బంధంలో గొడవలు సహజం. వీరి మధ్యలో మూడవ వ్యక్తుల చొరవతో ఆ గొడవలు పెద్దది అవుతున్నాయి. వీరి మధ్య పెరిగిన దూరాన్ని సర్థి చెప్పే ప్రయత్నంలో అత్తింటి బంధువుల జోక్యం అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నారు. దీంతో పురుషుడి కన్నా మహిళలు బాధితులవుతున్నారు. అత్తింట్లో తనకు మద్దతుగా నిలిచేవారు లేక.. కోడలు ఒంటరిది అవుతుంది. పుట్టింటోళ్లకి చెప్పినా సర్ధుకుపో అనే మాట ఖచ్చితంగా వినబడుతుంది. దీంతో కొన్ని సార్లు మానసిక సంఘర్షణకు గురైన మహిళలు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ఈ కుటుంబ కలహాలే ఓ మహిళను బలితీసుకున్నాయి. పెళ్లైన రెండు నెలలకే అత్తింటి వేధింపులకు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది.
భర్త, ఆడపడుచుతో గొడవ కారణంగా ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన తెలంగాణాలోని హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట్, భరత్‌నగర్ ప్రాంతానికి చెందిన మురారి అనూష(32)కు ఈ ఏడాది ఫిబ్రవరి 12న విజయవాడకు చెందిన నాంచారయ్యతో వివాహం జరిగింది. నాంచారయ్య సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, బీటెక్ పూర్తి చేసిన అనూష ఉద్యోగాన్వేషణలో ఉంది. మూడురోజుల క్రితం ఇంట్లో జరిగిన వేడుకలో భర్త నాంచారయ్య, ఆడపడచుతో గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వచ్చింది. పుట్టింటికి వచ్చాక కూడా భర్త, ఆడపడుచులు ఆమెను ఫోన్లో సాధించుకుతిన్నారు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైంది అనూష. ఈ నేపథ్యంలో బ్యాంకు పని ని ఉందని, తాను ఎస్‌ఆర్‌నగర్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటికి వచ్చింది. నేరుగా గగన్‌విహార్ భవనం 11వ అంతస్తు పైకి ఎక్కి సోదరుడికి వాయిస్ మెసేజ్ చేసి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది అనూష. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భర్త, ఆడపడుచుల టార్చర్ కారణంగా తన సోదరి ఆత్మహత్యకు పాల్పడిందని సోదరుడు కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.