తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేమ కోసం కాలరాస్తున్నారు కొంత మంది యువతీ యువకులు. తల్లిదండ్రులకు నచ్చజెప్పి పెళ్లి చేసుకోవాల్సిన ప్రేమికులు.. వారు కాదంటారేమోనని ఇంట్లో నుండి పారిపోవడం వంటి చర్యలకు దిగుతున్నారు.
ప్రేమ మత్తులో పడిన యువతీ యువకులకు మరో ప్రపంచం కనిపించదు. తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువుల మాటలు చెవికెక్కవు. ఆ సమయంలో ఏదీ చెప్పినా వినిపించుకోరు. ప్రేమికులు చెప్పిందే లోకంగా భావిస్తుంటారు. తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేమ కోసం కాలరాస్తున్నారు. తల్లిదండ్రులకు నచ్చజెప్పి పెళ్లి చేసుకోవాల్సిన ప్రేమికులు.. వారు కాదంటారేమోనని ఇంట్లో నుండి పారిపోవడం వంటి చర్యలకు దిగుతున్నారు. వారు ఒప్పుకోలేదంటే తమ గమ్యాన్ని, లక్ష్యాలను విడిచి, తమ ప్రేమను సఫలీకృతం చేసుకునేందుకు ఎంతటికైనా తెగిస్తుంటారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ఓ యువతి ఏం చేసిందంటే..
స్నేహితుడి ఇంటికి పోయి వస్తాను అని వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన హైదరాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ఉత్తమ్ రావు కుటుంబం బ్రతుకు దెరువు కోసం కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి బోయిన్ పల్లిలో నివాసముంటోంది. అక్కడ సిఖ్ విలేజ్‌లోని జైన్ స్కూల్‌లో ఉత్తమ్ రావు వాచ్ మెన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి ఓ కుమారుడు, కూతురు రాచారి కిరణ్ అమృత రావు (19) ఉన్నారు. కూతురు అమృత ఓ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. ఈ సమయంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాహుల్ జోషి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే ఇది కాస్త ప్రేమకు దారి తీసింది.
ఈ క్రమంలో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుని ఇంట్లో విషయాన్ని తెలిపారు. కానీ ఆమె ఇంట్లో ఒప్పుకోలేదు. అయితే ఆమెను కట్టడి చేయడం మొదలు పెట్టారు. తనను ఇలా చేస్తున్నారని తెలిసి ఆమె తల్లిదండ్రుల మాట వింటున్నట్లు, ఆ అబ్బాయిని పూర్తిగా మర్చిపోయినట్లు వారిని నమ్మించింది. అయితే గురువారం తన స్నేహితుడి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన అమృత తిరిగి రాలేదు. కాగా, ఆమె రాహుల్‌తో వెళ్లి ఉంటుందని తల్లిదండ్రులు భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇలాగే ఐదు నెలల క్రితం ఆమె ఇంటినుడి వెళ్లిపోవడం.. తల్లి దండ్రులు తిరిగి తీసుకు వచ్చినట్లు సమాచారం.