చదువుల ఒత్తిడో లేక, విద్యా సంస్థల యాజమాన్య ధోరణే తెలియదు కానీ.. విద్యార్థులు క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి.. ఎంతో భవితవ్యాన్ని చూడాల్సిన విద్యార్థులు.. ఆ దశలోనే నేల రాలుతున్నారు. తాజాగా మరో విద్యా కుసుమం బలవన్మరణానికి పాల్పడింది.
చదువులు చెప్పాల్పిన విద్యాలయాలు.. విద్యార్థుల పాలిట మృత్యు నిలయాలుగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి.. సీనియర్ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అలాగే నార్సింగిలో సాత్విక్ అనే ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన సంగతి విదితమే. నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తానో లేదో అని శ్రీ వైష్ణవి అనే ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇప్పుడు మరో విద్యార్థిని బలౌంది. అయితే ఆమె చనిపోవడం వెనుక కారణాలను పోలీసులు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు పడుతున్నారు.
ఈ ఘటన తెలంగాణలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చెందిన విద్య ప్రియాంక అనే యువతి ప్రగతి నగర్‌లో ఉన్న ఎక్సెల్ కాలేజీలో నీట్ కోచింగ్ తీసుకుంటుంది. అక్కడ హాస్టల్‌లోనే ఉండి చదువుకుంటోంది. అయితే సోమవారం రాత్రి 10గంటల సమయంలో కళాశాల బిల్డింగ్ 4 వ ఫ్లోర్ నుండి దూకి విద్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు విద్యార్థినిని ఆసుపత్రికి తరలించినప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.
విద్య ప్రియాంక సూసైడ్ లెటర్ రాసి మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఎందుకు చనిపోయిందన్న విషయాన్ని పోలీసులు బయటకు రానివ్వకుండా గోప్యంగా ఉంచుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. విద్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విద్యార్థిని మృతితో ఎక్సెల్ కళాశాలతో ఎటువంటి సంబంధం లేదని యాజమాన్యం చెబుతోంది. చౌటుప్పల్ సమీపంలో ఉన్న దవవో మెడికల్ అకాడెమీ లో కోచింగ్ తీసుకుంటుందనీ , తాము ఇక్కడ అకామిడేషన్ మాత్రమే ఇస్తున్నట్లు తెలిపింది. కాగా, యువతి సూసైడ్ నోట్ కూడా బయటకు వచ్చింది.