దేశంలో అత్యాచారాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రేమ పేరుతో, ఉద్యోగాల పేరిట, తాగిన మత్తులో, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ముందుగా బలైపోతున్నారు అబలలు. ఉద్యోగమిస్తానని మాయమాటలు నమ్మి బలైందో మహిళ.
దేశంలో ఎన్ని చట్టాలు, కోర్టులు ఉన్నా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. పుట్టిన పసిగొడ్డు నుండి కాటికి కాళ్లు చాచిన ముసల్లమ్మ వరకు ఎవ్వరినీ మగాళ్లు వదలడం లేదు. ప్రేమ పేరుతో, ఉద్యోగాల పేరిట, తాగిన మత్తులో, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ముందుగా బలైపోతున్నారు అబలలు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు అత్యాచారానికి ఒడిగడుతున్నారు. చట్టాలు కూడా వీరికి చుట్టాలుగా మారిపోతున్నాయి. నిందితులకు తూతూ మంత్రంగా శిక్షలు వేసి చేతులు దులుపుకోవడంతో బాధితులను మరింత బాధపెడుతున్నాయి. దీంతో కామాంధులు మరింత రెచ్చిపోతున్నారు. ఇష్టమొచ్చిన రీతిగానూ మహిళలపై కీచక పర్వాన్ని సాగిస్తున్నారు.
ఉద్యోగం ఇప్పిస్తానని పిలిచి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడో కిరాతకుడు. మత్తు మందు ఇచ్చి లైంగికంగా దోచుకున్నాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిఎల్ఎఫ్ సొసైటీకి చెందిన బాధితురాలు (27) సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఓ ఆన్ లైన్ ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఈ ప్రక్రియలో తుషార్ శర్మ నంబర్ కనిపించింది. ఆమె తుషార్ కి ఫోన్ చేయగా..సహారా మాల్‌లో ఇంటర్వ్యూకి రావాలని కోరాడు. ఆమె అక్కడకు చేరుకోగానే తన కారు పార్కింగ్ చేసిన బేస్‌మెంట్‌కు రావాలని కోరి, అక్కడకు తీసుకెళ్లి, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.
బాధితురాలు చెప్పిన దాని ప్రకారం.. తుషార్ చెప్పినట్టుగా గత శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు సహారా మాల్ కు వచ్చాను. మాల్ ఎంట్రన్స్ ద్వారా తనను కలిసి, తన గురించి అడిగి.. ఉద్యోగం వివరాలు అడిగాడు. అనంతరం బేస్‌మేంట్ కు తీసుకెళ్లాడు. అక్కడ నీళ్లు తాగమంటూ మత్తు మందుకు కలిపిన నీటిని ఇచ్చాడు. వెంటనే స్పృహ తప్పి పడిపోవడంతో తనపై అత్యాచారం చేసి, అక్కడ నుండి పరారయ్యాడు. మెలకువ వచ్చిన మహిళ.. పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపారు. నిందితుడిపై ఐపిసి 328,376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.