నేటి యువత చెడు సవాసాలకు లోనవుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలై.. తల్లిదండ్రులను ఆవేదనకు గురి చేస్తున్నారు. అలా ఓ నటి కుమారుడు చెడు వ్యసనాలకు మరిగి, మానసిక రోగిగా మారాడు. అంతే కాకుండా ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
నేటి సమాజంలో యువత ఎంత అరాచకాలకు ఒడిగడుతున్నారంటే, కన్నవాళ్లను, కట్టుకున్న భార్యను, తోబుట్టువుల ఊపిరి తీస్తున్నారు. చెడు వ్యసనాలు, సహవాసాలకు లోనై, డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించడం, ఇవ్వకపోతే గొడవకు దిగడం లేదంటే దాడి చేయడం వంటి చర్యలకు దిగుతున్నారు. ముసలి వయస్సు వచ్చిన తల్లిదండ్రులకు అండగా ఉండి, తోబుట్టువులకు స్నేహితుడిగా మెలగాల్సిన వ్యక్తి క్రూర మృగమయ్యాడు. తన ఇంట్లోని ఇద్దర్ని అత్యంత కిరాతకంగా బలితీసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అందులోనూ చిత్ర పరిశ్రమకు చెందిన కుటుంబంలో జరగడం చెన్నైవ్యాప్తంగా కలవర పాటుకు గురి చేసింది.
వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని మన్గాడు అడిసన్ నగర్‌లో సెల్వరాజ్-శాంతి దంపతులు నివసిస్తున్నారు. శాంతి చిత్ర పరిశ్రమలో సహాయ నటిగా చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడికి వివాహమై కుటుంబంతో కలిసి మరో చోట ఉంటున్నారు. ఆమె కూతురు ప్రియకు కూడా వివాహం కాగా, తల్లిదండ్రులకు సమీపంలోనే నివసిస్తోంది. ఈ దంపతుల చిన్న కుమారుడు ప్రకాష్ డ్రగ్స్‌కు బానియ్యాడు. దీంతో అతడు కొంచెం మానసికంగా దెబ్బతిన్నాడు. అయితే కుటుంబ సభ్యులు ఇతడిని మెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఇటీవల చికిత్సకు డబ్బులు సరిపోకపోవడంతో ఆస్పత్రి నుండి ఇంటికి తీసుకు వచ్చాడు. అయితే ఆదివారం ఇంట్లోనే నిద్రిస్తున్న తండ్రి సెల్వరాజ్ గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత సమీపంలోని సోదరి ఇంటికి వెళ్లి ఆమెతో కూడా వాగ్వాదానికి దిగాడు.
వాగ్వాదం సమయంలో తనతో తెచ్చుకున్న కత్తితో సోదరిని పొడిచి చంపాడు. అయితే అదే సమయంలో నటి శాంతి దుకాణానికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. వారిని హత్య చేసి పరారయ్యాడు. ఇంటికి వచ్చిన శాంతి.. భర్త రక్తపు మడుగుల్లో పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందింది. అటు కుమార్తె కూడా హత్యకు గురి కావడంతో ఆమె వేదన వర్ణనాతీతం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గురైన తండ్రి సెల్వరాజ్, కూతురు ప్రియ మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు ప్రకాష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాష్ తమిళ సినిమాలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసినట్లు సమాచారం. అయితే పోలీసులు అతడ్ని విచారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తనను మెంటల్ ఆసుపత్రికి పంపాలని తన తల్లి, సోదరి అనుకుంటుండగా విన్నానని దీంతో కోపంతో అందర్ని చంపాలని భావించినట్లు చెప్పాడు. ముందుగా అమ్మను చంపాలని భావించానని, అయితే ఆమె బయటకు వెళ్లడంతో తప్పించుకుందని, పడుకున్న తన తండ్రిని గొంతు కోసి చంపానని, అదే కత్తితో తన అక్కను పొడిచి చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని పెరంబదూర్ కోర్టులో హాజరు పరిచారు. చికిత్స కోసం అతడిని చెన్నైలోని అయనవరం మెంటల్ ఆసుపత్రికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తనను బలవంతంగా తన కుటుంబ సభ్యులు మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించాలని నిర్ణయించుకున్నారనే కోపంతో ఓ యువకుడు తన తండ్రిని, చెల్లిని దారుణంగా హతమార్చిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.